కమలం చుట్టూ అసమ్మతి ‘గీత’

Apr 3,2024 21:54

ప్రజాశక్తి-సాలూరు : టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఎమ్‌పి అభ్యర్థి కొత్తపల్లి గీత చుట్టూ అసమ్మతి సెగలు అలుముకుంటున్నాయి. బిజెపి నాయకత్వం ఎమ్‌పి అభ్యర్థిగా మాజీ ఎమ్‌పి కొత్తపల్లి గీతని ప్రకటించగానే ఆ పార్టీకి చెందిన గిరిజన నాయకులు అసమ్మతి తెలుపుతున్నారు. ఆ అసంతృప్తి కాస్తా రోజురోజుకూ చినికిచినికి గాలివానలా మారుతోంది. అసలే రాష్ట్రం పట్ల తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న బిజెపిపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సొంత పార్టీ, కూటమి నేతలు కూడా తిరుగుబాటు బావుటా ఎగుర వేస్తుండటంతో మున్ముందు ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాలోనన్న చర్చ సర్వత్రా సాగుతోంది.అరకు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో గిరిజన ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. 50శాతం పైగా గిరిజన ఓటర్లు ఉన్న కారణంగా ఎస్‌టిలకు ఎమ్‌పి సీటు రిజర్వు చేశారు. ఆరు గిరిజన అసెంబ్లీ నియోజకవర్గాల్లో బిజెపికి ఉన్న ఓట్ల శాతమే చాలా తక్కువ. ఈ సీటుని పొత్తులో భాగంగా బిజెపికి టిడిపి కేటాయించడం ఆత్మహత్యా సదృశ్యం లాంటిదనే అభిప్రాయం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. పొత్తు ధర్మంలో భాగంగా టిడిపి త్యాగం చేసినా అభ్యర్థి ఎంపికలో బిజెపి అధిష్టానం నిజమైన గిరిజనులను పట్టించుకోలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బిజెపి సీనియర్‌ నాయకులు, మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజ్‌తోపాటు మరో గిరిజన నాయకులు కెవి సత్యనారాయణ రెడ్డి కూడా అరకు ఎమ్‌పి సీటు ఆశించారు. ఆదివాసీ గిరిజన సంఘాలతో సంబంధాలు కలిగిన జయరాజ్‌, కెవి సత్యనారాయణ రెడ్డి లాంటి నిజమైన గిరిజన నాయకులను బిజెపి పరిగణనలోకి తీసుకున్న దాఖలాలు లేవు. మాజీ ఎమ్‌పి కొత్తపల్లి గీత 2014 నుంచి ఎస్‌టి కాదనే కులవివాదాన్ని ఎదుర్కొంటున్నారు. ఆమె ఎస్‌సి క్రిష్టియన్‌ అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆమె తల్లిదండ్రుల ధ్రువపత్రాల ఆధారంగా ఎస్‌టి కాదని గిరిజన సంఘాలు వాదిస్తున్నాయి. ఈ ఆధారాల ప్రకారమే గతంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యాన జిల్లా స్థాయి పరిశీలక కమిటీ ఆమె ఎస్‌టి కాదని పేర్కొంటూ నివేదిక సమర్పించింది. కొద్దినెలల క్రితం రాష్ట్ర స్థాయి పరిశీలక కమిటీ కూడా విచారణ చేపట్టి గీత ఎస్‌టి కాదని నిర్ధారిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై ఆమె హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుని ప్రస్తుతం ఎస్‌టిగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది.తొలి నుంచీ వ్యతిరేకతఅరకు ఎమ్‌పి సీటుకు అభ్యర్థిని ప్రకటించక ముందు నుంచి కొత్తపల్లి గీత పేరు ప్రచారంలోకి వచ్చింది. ఆమె పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఎక్కడికక్కడ ప్రచార హోర్డింగులు పెట్టించి బిజెపిలో తన పలుకుబడిని చాటుకున్నారు. ప్రచారం జరిగినట్లుగానే ఆమెను బిజెపి ఖరారు చేయడంతో ఆదివాసీ గిరిజన సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బిజెపి పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు కూడా గీతకు అరకు ఎమ్‌పి సీటు ఇవ్వొద్దని కోరుతూ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. అయితే ఆ ఫిర్యాదును పార్టీ రాష్ట్ర నాయకత్వం పరిగణనలోకి తీసుకున్న దాఖలాలు లేవు. గీతని ఎమ్‌పి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మాజీ ఎమ్మెల్యే జయరాజ్‌ తీవ్రంగా స్పందించారు. నకిలీ గిరిజన నాయకురాలు, ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటున్న కొత్తపల్లి గీతకు ఎమ్‌పి సీటు ఇవ్వకుండా నిజమైన గిరిజన నాయకులకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అక్కడితో ఆగకుండా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిపై కూడా ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆమె పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఎపిలో బిజెపి భ్రష్టుపట్టిందని ధ్వజమెత్తారు. ఆమెకు వ్యతిరేకంగా బిజెపికి చెందిన మాజీ ఎమ్మెల్యే జయరాజ్‌ ప్రచారం చేస్తున్నారు. కూటమిలో విభేదాలు!సాలూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి సంధ్యారాణి కూడా గతంలో కొత్తపల్లి గీత అభ్యర్థిత్వంపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. 2014లో వైసిపి అభ్యర్థి కొత్తపల్లి గీతపై టిడిపి అభ్యర్థిగా సంధ్యారాణి పోటీ చేశారు. ఆ తర్వాత ఆమె ఎస్‌టి కాదని పేర్కొంటూ హైకోర్టులో కేసు వేసి ఉపసంహరించుకున్నారు. రెండు రోజుల క్రితం ఎమ్‌పి అభ్యర్థి కొత్తపల్లి గీత పట్టణానికి వచ్చి టిడిపి నాయకులు, కార్యకర్తలను కలిశారు. మాజీ ఎమ్మెల్యే ఆర్‌పి భంజ్‌దేవ్‌ నివాసంలో బిజెపి, జనసేన, టిడిపి నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. కానీ, ఆ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి సంధ్యారాణి పాల్గొనలేదు. మామిడిపల్లి సమీపంలో నిర్వహించిన టిడిపి సమావేశానికి సంధ్యారాణి హాజరయ్యారు. ఈ సమావేశానికి కొత్తపల్లి గీత, భంజ్‌ దేవ్‌ కూడా హాజరయ్యారు. ఇక్కడ సంధ్యారాణి, గీత తప్పని పరిస్థితుల్లో పలుకరించుకుని కూటమి ఐక్యత చాటుకున్నారు. ఏమైనా అరకు కూటమి అభ్యర్థి చుట్టూ అసమ్మతి సెగలు రాసుకుంటున్నాయి. ఆమెని వ్యతిరేకిస్తూ బిజెపి నాయకులే బహిరంగ విమర్శలు చేస్తున్నారు. మున్ముందు ఉమ్మడి ఎమ్‌పి అభ్యర్థి కొత్తపల్లి గీతపై ఇంకెంతమంది నాయకులు అసమ్మతి రాగం వినిపిస్తారనేది చర్చనీయాంశమవుతోంది.

➡️