శత శాతం ఓటింగే లక్ష్యం

May 4,2024 21:40

ప్రజాశక్తి-విజయనగరం కోట: జిల్లాలో శత శాతం ఓటింగ్‌ సాధించాలన్నదే ఎన్నికల కమిషన్‌ లక్ష్యమని ట్రైనీ సహాయ కలెక్టర్‌ బి.సహదిత్‌ వెంకట్‌ త్రివినాగ్‌ చెప్పారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని వసతులు కల్పిస్తున్నామని ప్రతి ఓటరు తమ ఓటు నిర్భయంగా వినియోగించు కోవాలని కోరారు. ఓటర్లకు మరింత వెసులుబాటు కల్పించడంలో భాగంగా ఈ ఎన్నికల్లో పోలింగ్‌ సమయాన్ని గంటపాటు పెంచడం జరిగిందని చెప్పారు. ఓటర్ల చైతన్య కార్యక్రమం స్వీప్‌ లో భాగంగా నగరంలోని రాజీవ్‌ స్టేడియం నుంచి మహాత్మా గాంధీ విగ్రహం వరకు శనివారం నిర్వహించిన రెండు కిలోమీటర్ల పరుగును ఆయన ప్రారంభించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజీవ్‌ స్టేడియం వద్ద ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు, క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో 85 ఏళ్లు వయసు నిండిన వద్ధులు, వికలాంగులు ఇంటి వద్దే తమ ఓటు హక్కు వినియోగించుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నామని, మే 7 నుంచి 10వ తేదీ వరకు హోం ఓటింగ్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారు ఓటు వేయడంపై దృష్టి సారించామన్నారు. జిల్లాలో ప్రతి ఓటరు తమ ఓటరు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకొనే విధంగా యంత్రాంగం చర్యలు చేపడుతోందని చెప్పారు. ఈ సందర్భంగా పరుగులో పాల్గొన్న వారితో ట్రైనీ కలెక్టర్‌ సహాదిత్‌ వెంకట్‌ త్రివినాగ్‌ ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా స్వీప్‌ నోడల్‌ అధికారి, హౌసింగ్‌ పీడీ శ్రీనివాస్‌, డిఎస్‌డిఒ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

➡️