TDP-Janasena: సంక్షేమం అభివృద్ధి అంతా బూటకమే : నాదెండ్ల మనోహర్‌

ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు) : ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌ అన్నింటా విఫలమయ్యారని, అభివృద్ధి సంక్షేమం అని చెబుతున్న మాటలన్నీ బూటకమేనని టిడిపి, జనసేన ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ అన్నారు. తెనాలిలోని పెదరవూరులో గురువారం టిడిపి, జనసేన పార్టీల ఆత్మీయ సమావేశం జరిగింది. మాజీ మంత్రి, టిడిపి తెనాలి నియోజకవర్గం ఇంచార్జ్‌ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గం అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ను.. టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలకు నాదెండ్ల మనోహర్‌ పరిచయం చేశారు. తొలుత టిడిపి వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మనోహర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం జనసేన, టీడీపీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. వైసిపి పాలనపై ధ్వజమెత్తారు. జగన్‌ తన సొంత ఆస్థులు పెంచుకోవటం కోసం రాష్ట్రంలో పాలన సాగుతుందన్నారు. టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో కలిసికట్టుగా ముందుకు వెళితేనే విజయం సాధిస్తామని రాబోయే రోజుల్లో పవన్‌ కళ్యాణ్‌, చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో మంచి ప్రణాళికతో అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడతామన్నారు. ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్‌ను, ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కోరారు. డాక్టర్‌ పెమ్మసాని మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో జనసేన, టిడిపి కార్యకర్తలు ఎన్నికల సమరానికి సిద్దం కావాలన్నారు. భావితరాలకు భవిష్యత్తుకు చిరునామాగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు పవన్‌, చంద్రబాబునాయుడు సిద్ధంగా ఉన్నారన్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ టిడిపి జనసేన పొత్తు లక్ష్యాలు నెరవేర్చేందుకు ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలు బాధ్యతతో పనిచేయాలన్నారు. సమావేశంలో అధిక సంఖ్యలో జనసేన టిడిపి నాయకులు పాల్గొన్నారు.

➡️