12, 13 తేదీల్లో ఈవీఎంల కేటాయింపు ప్రక్రియ

Apr 10,2024 22:17

మాట్లాడుతున్న కలెక్టర్‌
ప్రజాశక్తి-గుంటూరు :
ఈవీఎంల మొదటి ర్యాండమైజేషన్‌ ప్రక్రియ ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలు పాటిస్తూ పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ఆదేశించారు. ఈవీఎంల మొదటి ర్యాండమైజేషన్‌ ప్రక్రియపై అసెంబ్లీ నియోజకవర్గాల ఏఆర్వోల బృందాలకు కలెక్టరేట్‌లో బుధవారం అవగాహన కల్పించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలకు జిల్లాలోని నియోజకవర్గాలకు ఈవీఎం యూనిట్లు బ్యాలెట్‌ యూనిట్‌, కంట్రోల్‌ యూనిట్‌, వీవీప్యాట్లను మొదటి ర్యాండమైజేషన్‌ ప్రక్రియ ద్వారా కేటాయిస్తారని చెప్పారు. ఈవీఎంల మొదటి ర్యాండమైజేషన్‌ ఏప్రిల్‌ 12, 13 తేదీల్లో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కట్టుదిట్టమైన భద్రతతో రెవెన్యూ కళ్యాణ మండపంలో నిర్వహిస్తామన్నారు. జిల్లాకు కేటాయించిన ఈవీఎం యూనిట్లను గతంలోనే బెల్‌ ఇంజనీర్లు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఫస్ట్‌ లెవల్‌ చెకింగ్‌ చేశారని తెలిపారు. ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ ద్వారా ర్యాండమైజేషన్‌ ద్వారా నియోజకవర్గాలకు కేటాయించిన బ్యాలెట్‌ యూనిట్‌, కంట్రోల్‌ యూనిట్‌, వీవీప్యాట్లను జాగ్రత్తగా సరిచూసుకొని ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం పూర్తి భద్రత మధ్య డిస్టిబ్యూషన్‌ సెంటర్లలోని స్ట్రాంగ్‌ రూంలకు తరలించాలని చెప్పారు. ర్యాండమైజేషన్‌ విధుల్లో అధికారులు, ఉద్యోగులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ బాధ్యతగా విధులు నిర్వహించాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పి.రోజ, ఈవీఎంల నోడల్‌ అధికారులు హౌసింగ్‌ పీడీ వేణుగోపాల్‌, ఐటీ నోడల్‌ అధికారి రఘు, ర్యాండమైజేషన్‌ విధులు కేటాయించిన ఏఆర్వోలు, ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️