అంగన్వాడీ కార్యకర్తను నియమించాలి

నిరసన చేపడుతున్న తల్లులు, పిల్లలు

ప్రజాశక్తి -అనంతగిరి:మాతా శిశు మరణాలు అరికట్టేందుకు గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారునికి పౌష్టికాహారం అందించాలని, అంగన్వాడి కార్యకర్తలను నియమించాలని మండలంలోని మారుమూల పెద్దకోట పంచాయతీ పరిధి కొండిభ కోట గ్రామానికి చెందిన తల్లులు గర్భిణీలు, పిల్లలు మంగళవారం నిరసన చేపట్టారు. కొండతాబెల, సుజాతగుంట, అమ్మాజీ గొల్లూరి, దానుమోతి ఈ సందర్భంగా మాట్లాడుతూ, తమ గ్రామంలో సుమారు 30 కుటుంబాలు 160 పైగా జనాభా ఉందన్నారు. బాలింతలు, గర్భిణీలు పది మంది, పిల్లలు 25 మంది ఉన్నారని తెలిపారు. తమ గ్రామంలో అంగన్వాడి పోస్టును ప్రభుత్వం భర్తీ చేయలేదని, దీంతో తమ గ్రామం నుండి సుమారు కిలోమీటర్‌ దూరం గెడ్డ వాగు దాటి తమ్ముటు గ్రామానికి వెళ్ళవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో గెడ్డ పొంగి పారుతుండటంతో వాగు దాటి వెళ్ళలేని పరిస్థితి నెలకొంటుందన్నారు.జిల్లా కలెక్టర్‌, పిఓ, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి తమ కొండిబకోట గ్రామంలో కొత్త అంగన్వాడి పోస్టును మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. మూడు రోజుల క్రితం గ్రామంలో పర్యటనకు వెళ్లిన స్థానిక జెడ్పిటిసి దీసరి గంగరాజు దృష్టికి కూడా ఈ విషయాన్ని గ్రామ ప్రజలు విన్నవించారు.

➡️