కొండగట్టులో పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేక పూజలు

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో :జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. డిప్యూటీ సిఎం హోదాలో తొలిసారి కొండగట్టుకు వచ్చిన ఆయనకు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం పవన్‌కల్యాణ్‌ను శాలువాతో సత్కరించి ప్రసాదాలు అందజేశారు. కొండగట్టు అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని, గుట్టపై వంద గదుల నిర్మాణానికి టిటిడి ఆర్ధిక సహకారం అందించాలని కొండగట్టు ఆలయ ఇఒ చంద్రశేఖర్‌ వినతిపత్రం అందజేశారు. పవన్‌కల్యాణ్‌ను చూసేందుకు ఆయన అభిమానులు పెద్దఎత్తున గుట్టపైకి చేరుకోవడంతో వారిని అదుపుచేయడం పోలీసులకు కష్టంగా మారింది. పవన్‌కల్యాణ్‌ స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమైన సమయంలో ఆయన్ను కలిసేందుకు అభిమానులు పోటీపడ్డారు. అభిమానులను అదుపుచేసే క్రమంలో పోలీసులకు, పవన్‌ అభిమానులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. కారులో నుంచే పవన్‌కల్యాణ్‌ అభిమానులకు అభివాదం చేస్తూ వెళ్లిపోయారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ప్రారంభానికి ముందు పవన్‌ తన ప్రచార వాహనం వారాహికి కొండగట్టులోనే పూజ చేయించారు.

➡️