పశ్చిమ బెంగాల్‌ సిఎం మమతా బెనర్జీపై.. గవర్నర్‌ పరువు నష్టం దావా

Jun 29,2024 13:40 #Mamata Banerjee

కోల్‌కతా : పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీపై.. ఆ రాష్ట్ర గవర్నర్‌ సివి ఆనంద్‌ బోస్‌ పరువు నష్టం దావా వేశారు. మమతా ఇటీవల మహిళలు రాజ్‌భవన్‌లోకి వెళ్లేందుకు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకుగానూ ఆమెపై గవర్నర్‌ సివి ఆనంద్‌ శుక్రవారం కలకత్తా హైకోర్టులో కేసు నమోదుచేసినట్లు తెలుస్తోంది. కాగా, మే నెల మొదటివారంలో రాజ్‌భవన్‌లో పనిచేసే ఓ కాంట్రాక్ట్‌ మహిళా ఉద్యోగిని గవర్నర్‌ ఆనంద్‌ తనను లైంగిక వేధించారంటూ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మమతా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనపై కుట్ర పన్నారని, అందులో భాగంగానే ఈ ఆరోపణలొచ్చాయని గవర్నర్‌ కొట్టిపారేశారు. అయితే బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో.. తాజాగా మమతా సచివాలయంలో జరిగిన పాలక భేటీలో రాజ్‌భవన్‌కు వెళ్లాలంటే మహిళలు భయపడుతున్నారని, తనకు ఫిర్యాదులు చేస్తున్నారని’ ఆమె వ్యాఖ్యానించారు. మమతానే కాదు.. కొందరు టిఎంసి నేతలు కూడా గవర్నర్‌పై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. దీంతో మమతాబెనర్జీతోపాటు, టిఎంసి నేతలపైనా గవర్నర్‌ పరువు నష్టం దావా వేసినట్లు తెలుస్తోంది. గవర్నర్‌ చర్యలకి బిజెపి మద్దతు తెలిపింది. మరోవైపు సిపిఐ(ఎం) నేత సుజాన్‌ చక్రవర్తి రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిణామాలతో ఎలాంటి ప్రయోజనం ఒనగూరదని, పైగా జాతీయస్థాయిలో రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తాయని అన్నారు.

➡️