అర్ధాంతరంగా తొలగింపు అన్యాయం

నినాదాలు చేస్తున్న ఆదివాసీ గిరిజన సంఘం నేతలు, మహిళా సెక్యూరిటీ గార్డులు

ప్రజాశక్తి -పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ పరిధిలో 20 గురుకులం, ఏకలవ్య పాఠశాలు కళాశాలల్లో పనిచేస్తున్న ఆదివాసి మహిళా సెక్యూరిటీ గార్డులు అర్ధాంతరంగా తమ తొలగింపును వ్యతిరేకిస్తూ సోమవారం ఆదివాసి మహిళా సెక్యూరిటీ గార్డుల సంఘం, ఆదివాసి గిరిజన సంఘం అల్లూరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాడేరు జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ జోక్యం చేసుకొని తమను కొనసాగింపుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ దీనిపై చేపట్టిన రిలే దీక్షలు విరమించారు. టెండర్‌ మారిందనే నెపంతో తన అనుచరులు, కార్యకర్తల సంబంధించిన సెక్యూరిటీ గార్డులుగా నియమించుకోవడం కోసం పాడేరు ఎమ్మెల్యే ప్రోత్బలంతో ఇప్పటివరకు పని చేసిన తమను అర్ధాంతరంగా తొలగించడానికి పూనుకున్నారని మహిళా సెక్యూరిటీ గార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.బాలదేవ్‌ జిల్లా ఉపాధ్యక్షులు ఎల్‌.సుందర్రావు ఆదివాసి మహిళ సెక్యూరిటీ గార్డుల సంఘం అధ్యక్షులు గంపరాయి సీతమ్మ మాట్లాడుతూ, 2022 ఆగస్టు 15 తేదీ నుండి సేవా సుప్రీమ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ద్వారా గురుకులం ఏకలవ్య పాఠశాలలు కళాశాలల్లో సెక్యూరిటీ గార్డులుగా నియమించబడి విధులు నిర్వహిస్తున్న ఆదివాసి మహిళా సెక్యూరిటీ గార్డులను టెండర్‌ కాంట్రాక్ట్‌ మారిందనే కారణంతో పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఆదేశాల మేరకు విధుల్లోనుంచి తొలగించడం అన్యాయమన్నారు. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి తన కార్యకర్తలకు నియమిస్తూ టెండర్‌ కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై ఇప్పటివరకు పనిచేస్తున్న ఆదివాసి మహిళ సెక్యూరిటీ గార్లను కడుపు కొట్టి అన్యాయం చేయడం తగదన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌, ఐటీడీఏ పీఓ జోక్యం చేసుకొని మహిళ సెక్యూరిటీ గార్డులను న్యాయం చేయాలని లేనిపక్షంలో విజయవాడ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తామని హచ్చరించారు. ఎండా, వాన, రాత్రి పగలు క్రమశిక్షణతో డ్యూటీ చేశారని వీరి పొట్టలు కొట్టవద్దని కోరారు. ఏకపక్షంగా తన కార్యకర్తలు, అనుచరులను నియమిస్తామని బాహాటంగా ప్రకటించడం అన్యాయమన్నారు. గత పది రోజులు నుండి ఐటీడీఏ ముందు రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ కనీసం మహిళలని కూడా చూడలేదన్నారు. తమకు జరిగిన అన్యాయంపై ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టి తేల్చుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి మహిళ సెక్యూరిటీ గార్డులు ఎస్‌ కస్తూరి, ప్రశాంతి, బి.రాజమ్మ, గెమ్మెలి మంగమ్మ, పి.సావిత్రి, పి.నాగమణి, ఎం.సింహాచలం, ఎం.గంగా భవాని, జి నాగమణి, సిహెచ్‌ జ్యోతి, పి.లక్ష్మి, ఎన్‌.జ్యోతి, వి దుర్గా తదితరులు పాల్గొన్నారు.

➡️