తాగునీటి సమస్యపై ఆందోళన

మాట్లాడుతున్న జెడ్‌పిటిసి గంగరాజు

ప్రజాశక్తి -అనంతగిరి:కంటిపురం గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని మహిళలు సిపిఎం జెడ్పిటిసి డిసరి గంగరాజుతో కలిసి ఆందోళన చేపట్టారు. తమ గ్రామంలో తాగునీటి సమస్య నెలకు ఉందని గంగరాజు దష్టికి తీసుకు రావడంతో గురువారం ఆ గ్రామంలో సందర్శించిన ఆయన మహిళలతో తాగునీటి, ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహిళలు ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడుతూ, తమ గ్రామంలో ఏర్పాటు చేసిన బోరు మరమ్మతుకు గురై మూడు నెలలు గడుస్తుందని, దీంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు. అనంతరం మరమ్మతుకు గురైన బోరు వద్ద మహిళలతో కలిసి ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాగునీటి సమస్యపై అధికారులకు గ్రామస్తులు ఫిర్యాదు చేసినప్పటికీ పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించడం సమంజసం కాదన్నారు. గత్యంతరం లేక గ్రామానికి కిలోమీటర్లు దూరంలో ఉన్న ఊట నీరు ఉన్న ప్రదేశానికి వెళ్లి నీరు తెచ్చుకుంటున్నారని సమస్య పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడం పై ఆయన మండిపడ్డారు. జిల్లా పరిషత్‌ నిధులతో పనులు చేసేందుకు ప్రతిపాదనలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. త్వరలోనే నీటి సమస్య పరిష్కారం చేస్తానని మహిళలకు, గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు టోకురు సర్పంచ్‌ కిల్లో మోస్య, వంతల బుద్రయ్య, మహిళలు అంటిపర్తి బుల్లమ్మ, ఎ.చెల్లమ్మ గ్రామస్తులు అంటిపర్తి దేముడుబాబు,అప్పారావు, బి.సంస్మోన్‌ రాజు, జె.అప్పలనాయుడు, ఎ.పెంటన్న పాల్గొన్నారు.

➡️