నిరాశలో నిరుద్యోగులు

నిరుద్యోగులు

ప్రజాశక్తి-పాడేరు టౌన్‌: వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీ తో పాటు ప్రతి ఏటా జాబ్‌ క్యాలెండర్‌ను ప్రకటిస్తానని పాదయాత్ర చేసినప్పుడు నిరుద్యోగులకు జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. ఇది ఇప్పటివరకు హామీల విషయం గుర్తుకు రాలేదు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్ల తొమ్మిది నెలలు దాటిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎన్నికల సమయం కావడంతో డిఎస్‌సి అంటూ హడావిడి చేస్తోంది. ఐదేళ్లుగా ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు నిరాశే మిగిల్చింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్‌సి అంటూ ఎన్నికల ముందు ఊదరగొట్టిన ముఖ్యమంత్రి జగన్‌.. అధికారంలోకి వచ్చిన నాలుగునరేళ్ళ తర్వాత ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో అరకొర పోస్టులతో డిఎస్‌సి ప్రకటించడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. గద్దెనెక్కాక నిరుద్యోగుల్ని ఇంతకాలం ఊరిస్తూ వచ్చారు.ఎన్నికలకు ముందు ఇప్పుడు భర్తీ చేస్తామని ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలో 329 ఉపాధ్యాయ పోస్టులు మాత్రమే భర్తీ చేస్తుండటంపై యువత ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎస్‌జిటిలు 101, స్కూల్‌ అసిస్టెంట్‌లు 133, టిజిటిలు 95 పోస్టులు మాత్రమే భర్తీ చేయడంపై నిరుద్యోగులు విస్మయం వ్యక్తం చేశారు. లక్షలు ఖర్చుపెట్టి నాలుగేళ్లుగా శిక్షణ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నామని, తీరా తమ ఆశలపై వైసిపి సర్కారు నీళ్లు చల్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. లక్షలు వెచ్చించి బిఎడ్‌, బిఇడి కోర్సులు పూర్తి చేసిన వారు తమ భవిష్యత్తు ఏమిటని ఆందోళన చెందుతున్నారు. ఇంతకాలం వేచి చూసిన ఉపయోగం లేకుండా పోతోందని కన్నీటి పర్యంతమవుతున్నారు. ముఖ్యమంత్రి నిరుద్యోగుల్ని దగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొత్తగా నియమితులయ్యే ఉపాధ్యాయులకు ఈసారి అప్రెంటిస్‌ విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఉపాధ్యాయ సంఘాల వారు జిల్లావ్యాప్తంగా ఇప్పటికే అప్రెంటిస్‌ విధానంపై తీవ్రవ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.117 జిఒతో తగ్గిన పోస్టులు…ఉమ్మడి విశాఖ జిల్లాలో 117 జిఒతో ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను ప్రభుత్వం కుదించింది. పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తిని తగ్గించిన నేపథ్యంలో ఎస్‌ జిటి పోస్టులను భారీ ఎత్తున కోల్పోవాల్సి వచ్చింది. పాఠశాలల విలీనం, రేసనలైజేషన్‌ ప్రక్రియతో కూడా పోస్టులు బాగా తగ్గాయి. తాజా నోటిఫికేషన్‌ తో నిరుద్యోగులకు ఎటువంటి ఉపయోగం లేదని విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.ప్రభుత్వం స్పందించి డిఎస్‌సిలో పోస్టులను భారీగా పెంచాలని ఆయా సంఘాల నేతలు కోరారు.

➡️