విశాఖలో అట్టహాసంగా ఎపిఎల్‌ ట్రోపీ, జెర్సీల ఆవిష్కరణ

Jun 29,2024 14:26 #apl, #Cricket, #Sports, #vizag

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ: ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్వర్యంలో జూన్‌ 30 నుండి నిర్వహించానున్న ఎపిఎల్‌ సీజన్‌ – 3 ట్రోఫీ, జెర్సీల ఆవిష్కరణ కార్యక్రమం విశాఖలోని ప్రముఖ హౌటల్‌లో శనివారం ఉదయం అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి గోపీనాథ్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఎపిఎల్‌కు ముందు చెన్నె, కర్ణాటక రాష్ట్రాలలో మాత్రమే స్థానిక ప్రీమియర్‌ లీగ్‌లు నిర్వహించేందుకు అనుమతి ఉండేదని ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌కు ఎపిఎల్‌ అనుమతుల విషయంలో బీసీసీఐ ఎంతో సహకరించిందన్నారు. గడిచిన 70 ఏళ్లుగా ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌కు ఉన్న పేరు ప్రఖ్యాతలు మరింత పెంచేలా ఈ లీగ్‌ నిర్వహిస్తున్నామన్నారు. స్థానిక క్రీడాకారుల ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ లీగ్‌ నిర్వహిస్తున్నామని రాష్ట్ర వ్యాప్తంగా ఏపిఎల్‌ రైసింగ్‌ స్టార్స్‌ పేరుతో 3000 మంది క్రీడాకారులకు సెలెక్షన్స్‌ నిర్వహించి పలువురు క్రీడాకారులను ఏపీఎల్‌కు ఎంపిక చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఉమెన్‌ టి20 లీగ్‌ రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఏపీఎల్‌లో ప్రతిభ కనబరచిన నితీష్‌ కుమార్‌ రెడ్డి వంటి క్రీడాకారులు ఐపీఎల్‌లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించారని, అదేవిధంగా ఎపిఎల్‌లో ఆడుతున్న క్రీడాకారులంతా దీనిని వేదికగా చేసుకుని భవిష్యత్తు లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆయన సూచించారు. గతంలో స్టార్‌ స్పోర్ట్స్‌ తెలుగులో ఈ లీగ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయగా ఈ సారి అంతర్జాతీయ స్థాయిలో ఫ్యాన్‌ కోడ్‌ ఓటిటీ, ప్రత్యక్ష ప్రసారం చేయనున్నామని తెలిపారు. అనంతరం ఈ లీగ్‌లో పాల్గొన బోయే జట్ల యొక్క యజమానులు, కెప్టెన్‌లు వారి వారి టీంల యొక్క జెర్సీలను ఆవిష్కరించారు. అనంతరం ఏపీఎల్‌ సీజన్‌ 3 ఏవిని, గోపీనాథ్‌ రెడ్డి ఆవిష్కరించగా ఏపీఎల్‌ సీజన్‌ 3 ట్రోఫీని ఏప్రిల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సభ్యులు మురళి, ఆస్కార్‌ వినోద్‌, గీత సంయుక్తంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైజాగ్‌ వారియర్స్‌ యజమాని నరేంద్ర రామ్‌, కాప్టెన్‌ కె.ఏస్‌.భారత్‌ బెజవాడ టైగర్స్‌ యజమాని శ్రీనివాస్‌ రెడ్డి, కెప్టెన్‌ రికీ భూరు, గోదావరి టైటాన్స్‌ సహా యజమాని హరీష్‌ పాలపాటి, కెప్టెన్‌ జ్ఞానేశ్వర్‌, ఉత్తరాంధ్ర లయన్స్‌, యజమానులు రవిక్రిష్ణ రెడ్డి, రామకృష్ణ రెడ్డి, కెప్టెన్‌ గుల్ఫం సాలే, కోస్టల్‌ రైడర్స్‌ యజమాని వెంకటాద్రి , వైస్‌ కెప్టెన్‌ అభిషేక్‌ రెడ్డి, రాయలసీమ కింగ్స్‌ , యజమాని దశరథ రామ రెడ్డి , కెప్టెన్‌ గిరినాథ్‌ రెడ్డి ఆయ జట్ల క్రీడాకారులు పాల్గొన్నారు.

➡️