మన్యంలో పర్యాటక ప్రాంతాలు కిటకిట

కొత్తపల్లి జలపాతం వద్ద భారీగా పర్యాటకులు

ప్రజాశక్తి-పాడేరు టౌన్‌: మన్యంలోని పర్యాటక కేంద్రాలు సందర్శకులతో కిటకిటలాడాయి. పండగ సెలవులు కావడంతో జనం ఏజెన్సీ బాట పట్టారు. దీంతో ఆది, సోమ మంగళ వారాలు ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాలు పర్యాటకులతో సందడి నెలకొంది. అనంతగిరి మండలం బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు ఎక్కడ చూసినా పర్యాటకులే కనిపించారు. పండగ వేళల్లో స్వగ్రామాల్లో బంధువులతో సరదాగా గడపడం సహజం. కానీ అందుకు భిన్నంగా కొందరు తమ వారితో పండగ సమయాలు పర్యాటక ప్రదేశాల్లో గడిపేందుకు ఆసక్తి చూపారు. దీంతో ఆది, సోమ, మంగళవారాలు అనంతగిరి మండలం బొర్రా గుహాలు, కటికి, తాటిగూడ జలపాతాలు, అరకులోయ మండలంలో మాడగడ మేఘాలకొండ, గిరిజన మ్యూజియం, పద్మాపురం గార్డెన్‌, కొత్తవలస వ్యవసాయ శిక్షణ కేంద్రం, గిరి గ్రామదర్శిని, డుంబ్రిగూడ మండలంలోని చాపరాయి, పాడేరు మండలంలో వంజంగి హిల్స్‌, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జల్లిపాతం, చింతపల్లి మండలంలో తాజంగి, చెరువువేనం, లంబసింగి ప్రాంతాలను అధిక సంఖ్యలో పర్యాటకులు సందర్శించారు. దీంతో సంక్రాంతి, కనుమ రోజుల్లోనూ పర్యాటక ప్రాంతాలు సందర్శకులతో కలకలలాడాయి.

➡️