రహదారి నిర్మాణాలు వేగవంతం చేయాలి

రహదారి నిర్మాణాలు వేగవంతం చేయాలి

ప్రజాశక్తి-పాడేరు:జిల్లాలో మారు మూల గ్రామాలలో రహదారి నిర్మాణాలు వేగవంతం చేయాలని ఎంపి జి.మాధవి సూచించారు. మంగళవారం విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లా అధికారులతో జిల్లా అభివృధ్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావేశాన్ని వర్చువల్‌ విధానంలో నిర్వహించారు. ఐటిడిఏ వీడియో కాన్ఫరెన్సుహాలు నుండి జిల్లా అధికారులు పాల్గొన్నారు. వివిధ శాఖల్లో అమలు చేస్తున్న అభివృద్ధి పథకాల ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ, అటవీ హక్కు పత్రాల పంపిణీపై ఆరా తీసారు. జిల్లాలో నిర్మిస్తున్న జాతీయ రహదారి పనులపై అడిగి తెలుసుకున్నారు. అటవీ హక్కు పత్రాలు పంపిణీ చేసిన భూముల అభివృద్ది, గంజాయి నిర్మూలించిన భూములలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ఆరా తీసారు. జగనన్న సురక్షా లో గుర్తించిన రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. నాడు నేడు పనులను వేగంగా పూర్తి చేయాలని స్పష్టం చేసారు. ఎంపీ లాడ్స్‌ పనుల నిర్వహణపై ఎంపిడిఓలకు ఓరియంటేషన్‌ ప్రాగ్రాం నిర్వహించాలని కలెక్టర్ను కోరారు.జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ మాట్లాడుతూ, జిల్లాలో ప్రధాన మంత్రి గ్రామ సడక్‌ యోజన పథకంలో మారుమూల గ్రామాలకు రహదారులు నిర్మిస్తున్నామని చెప్పారు. రంపచోడవరం, వై.రామవరం, మారేడు మిల్లి, మండలాల్లో ఏడు రోడ్లు మంజూరు చేసామని చెప్పారు. ఐటిడిఏ పిఓ వి.అభిషేక్‌ మాట్లాడుతూ, ఆర్‌ఓఎఫ్‌ ఆర్‌ కింద 1,13, 405 క్లైములు స్వీరించామని 2.76 లక్షల ఎకరాలకు అటవీ హక్కు పత్రాలు పంపిణీ చేసామన్నారు. 1,10,630 మంది రైతుల పట్టాలను డిజిటలైజేషన్‌ చేసామని చెప్పారు.ఈ సమావేశంలో జిల్లా పరిషత్‌ సిఇఓ ఎం. పోలినాయుడు, డిఎఫ్‌ఓ సూర్యనారాయణ, గృహ నిర్మాణ శాఖ ఇఇ బి.బాబు, పంచాయతీ రాజ్‌ పిఐ యు ఇఇలు కొండయ్య పడాల్‌ పాల్గొన్నారు.

➡️