ప్రమాదభరితం..అయినా పట్టించుకోరేం..!

ప్రమాదభరితం

కల్వర్టు మధ్యలో పడిన భారీ రంధ్రంతో పరేషాన్‌

ప్రమాదాలు జరుగుతున్నా స్పందించని అధికారులు

ప్రజాశక్తి – హుకుంపేట: మండలంలోని హుకుంపేట రోడ్డు నుంచి కామయ్యపేట రోడ్డు మీదుగా మెట్టుజోరుకు వెళ్లే రహదారిలో కల్వర్టు మధ్యలో గుంత పడి ప్రమాదభరితంగా ఉన్నా పట్టించుకోకపోవడంపై వాహనదారులు, పాదచారులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు వర్షాలు కారణంగా ఈ మార్గంలో కల్వర్టు దెబ్బతినడంతో రోడ్డు మధ్యలోనే భారీ గొయ్యి ఏర్పడింది. దీంతో ఏమాత్రం ఆదమరిచి ఆ మార్గంలో ప్రయాణించినా గోతిలో పడి గాయాలపాలవ్వడంతోపాటు వాహనాలు మరమ్మతుకు గురికావడం ఖాయమని వాహన చోదకులు, ప్రయాణీకులు ఆవేదన చెందుతున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు కూలిన కల్వర్టు వద్ద ప్రమాదం పొంచి ఉందని, అధికారులు,ప్రజా ప్రతినిధులు స్పందించి పైకప్పులో రంధ్రం ఏర్పడిన కల్వర్టును బాగుచేయడంతోపాటు, రోడ్డు పొడుగునా ఉన్న గోతులకు కనీసం మరమ్మతులైనా చేపట్టి పూడ్చాలని వేడుకుంటున్నారుఒడిశాతోపాటు అరకు, డుంబ్రిగుడ, హుకుంపేట మండలాల్లో పలు గ్రామాలకు వెళ్లేందుకు ఇదే ప్రధాన రహదారి కావడంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలు అధికంగా ఉంటాయని స్థానికులు అంటున్నారు. అంతేకాక అత్యంత ఎత్తైన’ సీతమ్మ పర్వతంపై అధిరోహించే పర్యాటకులు, సందర్శకులు కూడా ఈ మార్గంలోనే రాకపోకలు సాగిస్తుంటారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న రోడ్డులో కల్వర్టు పైకప్పులో గుంత ఏర్పడడంతోపాటు రహదారి ప్రయాణసంకటంగా ఉన్నా పట్టించుకోని వైనంపై ఆందోళన వ్యక్తమౌతోంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్‌, ఐటిడిఎ పిఒ, సంబంధిత ఇతర అధిóకారులు, అరకు ఎమ్మెల్యే, ఎంపి, ఇతర ప్రజా ప్రతినిధులు స్పందించాలని, అధ్వానంగా ఉన్న రోడ్డును ప్రయాణయోగ్యంగా బాగుచేయించాలని స్థానికులు కోరుతున్నారు.

రోడ్డు మధ్యలో కల్వర్టుపై ఏర్పడిన రంధ్రం

➡️