మూఢనమ్మకాలకు దూరంగా ఉండండి

మూఢనమ్మకాలకు దూరంగా ఉండండి

ప్రజాశక్తి- పెదబయలు : నాటువైద్యం, మూఢనమ్మకాల వల్ల కలిగే నష్టాలపై ప్రజలంతా అవగాహన కలిగి వాటికి దూరంగా ఉండాలని మూఢ నమ్మకాల నిర్మూలన సంఘ ప్రతినిధులు గిరిజనులకు చైతన్యం కలిగించారు. ఆదివారం ఇటీవల అనారోగ్యం బారిన పడిన మహిళలకు నాటువైద్యం చేసేందుకు వచ్చిన బూత వైద్యుడు గొరవగాడు మహదేవ్‌తోపాటు అతని సహాయకుడు త్రినాథ్‌ మృతి చెందిన ఘటన చోటుచేసుకున్న పెదబయలు మండలం చుట్టుమెట్ట గ్రామాన్ని సంఘ సభ్యులు సందర్శించి, బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఆనాడు జరిగిన ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గిరిజనులకు అనారోగ్యం చేస్తే వెంటనే వైద్యులను సంప్రదించి సరైన వైద్యం చేయించుకోవాలని, ఇలా నాటు వైద్యం, బూత వైద్యం అంటూ కాలయాపన చేస్తే ప్రాణాలమీదకు వస్తుందన్నారు.ఏజెన్సీలో ఇప్పటికే ఇలాంటివే అనేక ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, వాటన్నింటిపై అవగాహన కలిగి ఉండాలని గిరిజనులకు సూచించారు. సహదేవ్‌, త్రినాథ్‌ కుటుంబసభ్యులను పరామర్శించి, ఓదార్చారు. ఇప్పటికైనా గిరిజనులు చిల్లంగి, చేతబడి వంటి మూడ నమ్మకాలను వీడాలని, అస్వస్థతకు గురైతే సరైన వైద్యం చేయించుకుంటేనే నయమౌతుందన్న విషయాన్ని గుర్తించాలన్నారు.దీనిపై యువత అవగాహన, చైతన్యం పొంది పెద్దలకు చెప్పాలని సూచించారు. కార్యక్రమంలో మూఢనమ్మకాల నిర్మూలన సంఘ అధ్యక్షుడు కిల్లో రాంబాబు, సభ్యులు రామ్‌సాగర్‌, మామిడి రాధాభాయి, వసంత్‌, ఝాన్సీ రాణి, సింహాద్రి నాయుడు, రింతాడ ఉప సర్పంచ్‌ మడపాల సోమేష్‌కుమార్‌, గ్రామస్తులు కృష్ణారావు, రాములమ్మ, బాధిత కుటుంబసభ్యులు, మహిళలు పాల్గొన్నారు

బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్న సంఘ సభ్యులు

➡️