100 మెట్రిక్‌ టన్నుల మిరియాల కొనుగోలు లక్ష్యం

Jan 29,2024 23:21
మాట్లాడుతున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌

ప్రజాశక్తి -పాడేరు : గిరిజన రైతుల నుండి వంద మెట్రిక్‌ టన్నుల మిరియాలు కొనుగోలు చేయడానికి లక్ష్యంగా నిర్దేశించామని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ స్పష్టం చేసారు. రైతులకు గిట్టుబాటు ధర అందించాలని అధికారులను ఆదేశించారు. 11 మండలాల వ్యవసాయాధికారులు, ఉద్యాన వన అధికారులు, కాఫీ లైజన్‌ వర్కర్లతో కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మిరియాల కొనుగోలుపై సోమవారం సమావేశం నిర్వహంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,మిరియాలను దళారులకు తక్కువ ధరకు విక్రయించకుండా రైతులకు అవగాహన కల్పించాలని స్పష్టం చేసారు. కొయ్యూరు మినహా ప్రతీ మండలంలో పది మెట్రిక్‌ టన్నుల మిరియాల కొనుగోలు చేస్తామన్నారు. కిలో మిరియాలకు రూ.500లు రైతులకు చెల్లిస్తామని తెలిపారు. మిరియాల ఉత్పత్తిలో తగిన నాణ్యతలను పాటించాలని, తేమ తక్కువగా ఉండాలని సూచించారు. మిరియాలు సరఫరా చేసిన రైతులకు చెల్లింపులలో ఎటువంటి జాప్యం జరగదని చెప్పారు. ఉద్యాన వన అధికారులు, లైజాన్‌ వర్కర్లు వచ్చే నెల 1వ తేదీ నుండి 15 వ తేదీ గ్రామాల్లో పర్యటించి మిరియాల రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. మిరియాలు నిల్వ చేయడానికి గిరిజన రైతులకు గోని సంచులను ఉచితంగా సరఫరా చేస్తామన్నార. 10 వేల ఎకరాల్లో కాఫీ కన్సాలిడేషన్కు ప్రతి పాదనలు సమర్పించాలని అన్నారు.స్పైసెస్‌ బోర్డు సీనియర్‌ క్షేత్ర అధికారి బి.కల్యాణి మాట్లాడుతూ, గిరిజన రైతులు తోటల నుండి సేవకరించిన మిరియాల నూర్పిడిలో యంత్ర పరికరాలను వినియోగించాలని సూచించారు. కంకుల నుండి మిరియాలను వేరు చేయడానికి కాళ్లతో తొక్కడంతో బాక్టీరియా సోకి నాణ్యత తగ్గి పోతుందన్నారు. మిరియాలు నల్లగా ఉంటే మంచి ధర పలుకుతుందన్నారు. పచ్చి మిరియాలను ఒక నిమిషం వేడి నీటిలో ముంచి తీసి ఎండ బెడితే నల్లగా ఉండి మంచి ధర వస్తుందని సూచించారు. ఈ సమావేశంలో ఐటిడిఏ సహాయ ప్రాజెక్టు అధికారి ఎం.వేంకటేశ్వరరావు, కాఫీ సహాయ సంచాలకులు ఎన్‌.అశోక్‌, కాఫీ బోర్డు డిడి. రమేష్‌, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌.బి.ఎస్‌. నంద్‌, జిల్లా ఉద్యానవన అధికారి రమేష్‌ కుమార్‌రావు, 11 మండలాల వ్యవసాయాధికారులు, ఉద్యానవన అధికారులు, లైజన్‌ వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.

➡️