అసంపూర్తిగా అంగన్వాడి భవనం

Apr 13,2024 23:46

ఏళ్లు గడుస్తున్నా పూర్తి చేయని పనులు ప్రజాశక్తి-డుంబ్రిగుడ:ప్రభుత్వం మంజూరు చేసిన అంగన్వాడి కేంద్రం భవనాన్ని నిర్మించడంలో సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతో ఏళ్లు గడుస్తున్నా అసంపూర్తిగానే మిగిలిపోతున్నాయి. దీంతో లక్షలాధి రూపాయల నిధులు ప్రభుత్వం మంజూరు చేసినా ఉపయోగం లేకుండా పోతోంది. మండలంలోని కురిడి పంచాయతీ గదబగల్లుంగులో 2018లో ప్రభుత్వం అంగన్వాడి భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. దీంతో, భవనం పిల్లర్లు నిర్మించి స్లాబు వేసి అసంపూర్తిగా వదిలేశారు. భవనం పనులు పూర్తి కాకపోవడంతో అంగన్వాడి కేంద్రం నిర్వహణను ఓ నివాస గృహంలో కొనసాగిస్తున్నారు. ఈ గృహం వద్ద చిన్నారులకు ఆటపాటలు నేర్పించడానికి స్థలం సరిపోక నిర్వాహకులు, చిన్నారులు పలు ఇబ్బందులు పడుతున్నారు. అంగన్వాడి భవనాన్ని పూర్తి చేయాలని పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి అసంపూర్తిగా ఉన్న భవనాన్ని పూర్తిచేయాలని గిరిజనులు కోరుతున్నారు.

➡️