ఓట్ల లెక్కింపునకు ముమ్మర ఏర్పాట్లు

మాట్లాడుతున్న ఐటిడిఏ పిఒ అభిషేక్‌

ప్రజాశక్తి – అరకు లోయ:ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుకు రాజకీయ పార్టీలు సహకరించాలని అరకు అసెంబ్లీ నియోజక వర్గం రిటర్నింగ్‌ అధికారి, ఐటిడిఏ పిఓ వి.అభిషేక్‌ స్పష్టం చేసారు. స్ట్రాంగ్‌ రూం నుండి ఇవిఎంలు కౌంటింగ్‌ హాలు తరలించి, ఓట్లు లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేసామని చెప్పారు. గురువారం స్థానిక తహశీల్దారు కార్యాలయంలో ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్దులు, పార్టీల ప్రతినిధులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కౌంటింగ్‌ సమయంలో 144 సెక్టన్‌ అమలులో ఉంటుందని, ర్యాలీలకు అనుమతులు లేదన్నారు. గత ఎన్నికలలో పోలిస్తే అరకు వ్యాలీ అసెంబ్లీ నియోజక వర్గంలో పోలింగ్‌ శాతం పెరిగిందన్నారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనలు పక్కాగా అమలు చేస్తామన్నారు. కౌంటింగ్‌లో జాప్యం లేకుండా అందరూ సహకారం అందించాలని కోరారు. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌లు కౌంటింగ్‌ చేస్తామన్నారు. అనంతరం ఇవిఎంలు స్ట్రాంగ్‌రూం నుండి కౌంటింగ్‌కు తరలించి లెక్కింపు చేయడం జరుగుతుందన్నారు. కౌంటింగ్‌ ఏజెంట్లకు గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పారు. పాడేరు ఏఎస్‌పి ధీరజ్‌ మాట్లాడుతూ, 144 సెక్షన్‌ అమలులో ఉంటుందన్నారు. లౌడు స్పీకర్లు, బాణా సంచాలు టపాసులు పేల్చడానికి వీలులేదన్నారు. ప్రశాంత వాతావరణంలో కౌటింగ్‌ పూర్తి చేయవలసిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. పోలింగ్‌ ప్రక్రియ గిరిజన ప్రాంతంలో ప్రశాంతంగా విజయ వంతంగా పూర్తి చేసామన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల పరిసరాలలో సిసి కెమోరాలు, సిఆర్‌పిఎఫ్‌ జవాన్లు భద్రత ఉంటుందన్నారు. ఈ సమావేశంలో ఎస్డిసి వి వి ఎస్‌ శర్మ, తహశీల్దారులు సుధాకర్‌, సోమేశ్వరరావు, వివిద పార్టీల అభ్యర్దులు, ఏజెంట్లు, తదితరులు పాల్గొన్నారు.

➡️