Apr 20,2024 00:18
ఉత్సాహంగా అప్పలనర్స నామినేషన్‌

ర్యాలీలో అభివాదం చేస్తున్న అరకు సిపిఎం ఎంపీ అభ్యర్థి అప్పలనర్స,

అగ్ర భాగాన రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఉ

 

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి / పార్వతీపురం రూరల్‌ అరకు పార్లమెంట్‌ సిపిఎం అభ్యర్థి పాచిపెంట అప్పలనర్స అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో నామినేషన్‌ శుక్రవారం దాఖలు చేశారు. పార్వతీపురం మన్యం కలెక్టరేట్‌లో జిల్లా ఎన్నికల అధికారి (కలెక్టర్‌) నిశాంత్‌ కుమార్‌కు నామినేషన్‌పత్రాలను అందజేశారు. అప్పలనర్స.వెంట ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం, కిల్లో సురేంద్ర ఉన్నారు. అనంతరం అప్పనర్సకు మద్ధతుగా పార్వతీపురం పాత బస్టాండ్‌ నుంచి మెయిన్‌ రోడ్డు, ఆర్టీసి కాంప్లెక్స్‌ మీదుగా రైల్వే స్టేషన్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఇండియా బ్లాక్‌ పరిధిలోని సిపిఎం, సిపిఐ, న్యూడెమోక్రసీ, లిబరేషన్‌, కాంగ్రెస్‌, ఆప్‌ ఆమ్‌ఆద్మీ తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. నియోజకవర్గంలోని ఆయా పార్టీల శ్రేణులు పార్టీ జెండాలు చేతబూని, మండుటెండను సైతం లెక్కచేయకుండా కొండకోనలు, వాగువంకలు దాటుకుంటూ తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజన యువతులు, మహిళలు థింసా, కోలాటంతో సందడి చేశారు. గిరిజన సంప్రదాయ వాయిద్యాలు, డప్పుల దరువులు, అప్పలనర్సకు మద్ధతుగా చేసిన నినాదాలతో పార్వతీపురం మెయిన్‌రోడ్డు మారుమ్రోగింది. ర్యాలీ అనంతరం బెలగాం రైల్వే స్టేషన్‌కు సమీపంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు అధ్యక్షతన జరిగిన సభలో వివిధ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు మాట్లాడారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, భద్రాచలం మాజీ ఎంపీ డాక్టర్‌ మిడియాం బాబూరావు మాట్లాడుతూ సిపిఎం అభ్యర్థిగెలుపుతోనే ఆదివాసీ గిరిజనులకు న్యాయం జరుగుతుందని అన్నారు. గత పదేళ్లలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గిరిజన, రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలు చేసిందని, ఇందుకు రాష్ట్రంలోని వైసిపి, అంతకు ముందు టిడిపి ప్రభుత్వాలు కూడా వంతపాడాయని అన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో వైసిపి, టిడిపిలకు ఓటేస్తే బిజెపికి ఓటేసినట్టేనని చెప్పారు. అప్పలనర్స గెలుపుతోనే గిరిజనులకు రక్షణ అరకు పార్లమెంట్‌ అభ్యర్థి అప్పలనర్స గెలుపుతోనే గిరిజనుల ప్రాథమిక హక్కులు, చట్టాలకు రక్షణ సాధ్యమౌతుందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణ మూర్తి అన్నారు. బిజెపిని ఓడించకపోతే సగటు ప్రజానీకం మరిన్ని ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే గడిచిన పదేళ్లలో పదరికాన్ని పెంచారన్నారు. ఇక్కడి ఉన్న ఖనిజాన్ని సులువుగా దోచుకునేందుకు ఏజెన్సీలో పెద్దపెద్ద రోడ్లు వేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికీ తాగునీటికి కటకటలాడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. విద్య, వైద్య సదుపాయాలను కూడా కల్పించడం లేదన్నారు. అప్పలనర్స గెలుపు హక్కులను కాపాడుకోవడమేనని అన్నారు. బిజెకి బుద్ది చెప్పాలి : సిహెచ్‌ఎన్నార్‌ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు మాట్లాడుతూ దేశాన్ని కార్పొరేట్‌ శక్తులకు తాకట్టు పెడుతున్న బిజెపికి ప్రస్తుత ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఇండియా బ్లాక్‌ బలపర్చిన సిపిఎం అభ్యర్థులను గెలిపించడం ద్వారా దేశ ప్రయోజనాలు, హక్కులు పరిరక్షించుకోగలమని, లేదంటే దేశం, రాష్ట్రం, ముఖ్యంగా అరకు పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని ప్రజలు మరింత నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం మాట్లాడుతూ ప్రస్తుత ఎన్నికల్లో నీతికి, అన్యాయానికి మధ్య పోటీజరుగుతోందని అన్నారు. సిపిఎం అభ్యర్థి అప్పలనర్స ప్రజా సమస్యలపై పోరాడినందుకు జైలుకు వెళ్తే, బిజెపి అభ్యర్థి గీత అవినీతి, అక్రమాల కేసులో జైలుకు వెళ్లారని అన్నారు. వైసిపి అభ్యర్థి కూడా బిజెపికి తొత్తు వంటిదేనన్నారు. సిపిఐ ఎంల్‌ నాయకులు డి.వర్మ, లిబరేషన్‌ నాయకులు పి.సంఘం మాట్లాడుతూ పదేళ్లపాటు కార్పొరేట్లకు దోచిపెట్టిన బిజెపికి ఎన్నికల్లో తగిన గుణపాఠం నేర్పాలని అన్నారు. అప్పలనర్స గెలుపునకు ఊరూరూ కదిలించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్‌ నియోజకవర్గ నాయకులు గౌరీశంకర్‌ మాట్లాడుతూ బిజెపి, వైసిపి ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీలు తీరని ద్రోహంచేస్తున్నాయని విమర్శించారు. ఇటువంటి నేపథ్యంలో ఇండియా బ్లాక్‌ బలపర్చిన సిపిఎం అభ్యర్థిని ఎంపీగా గెలిపించాలని కోరారు. బిజెపి సంకల్ప పత్రంలో విభజన హామీలేవి? : అప్పలనర్ససిపిఎం అరకు పార్లమెంట్‌ అభ్యర్థి పి.అప్పలనర్స మాట్లాడుతూ ప్రత్యేక హోదా, విశాఖ రైల్వేజోన్‌, వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాకు నిధులు వంటివి బిజెపి ప్రకటించిన సంకల్ప పత్రంలో ఇవేవీలేవన్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రయోజనం కోసం బిజెపితో పొత్తుపెట్టు కుంటున్నట్టు టిడిపి, జనసేన కలిసి బిజెపితో పొత్తుపెట్టుకోవడం సిగ్గుచేటన్నారు. పాలకుల నిర్లక్ష్యంతో గిరిజనులు ఎక్కువగా చనిపోతున్నారని, వైద్య, వైద్య సదుపాయాలు కూడా తగినంతగా లేవన్నారు. తనుకు అవకాశం ఇస్తే ప్రజల సమస్యల పరిష్కరానికి కృషి చేస్తానని అన్నారు. ఆదివాసీగా చెప్పుకుంటున్న నకిలీ గిరిజనులను పాలక పార్టీలో ప్రోత్సహిస్తున్నాయి. కొత్తపిల్లి గీత కూడా నకిలీ గిరిజనురాలు కాదని గతంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ ప్రకటించినప్పటికీ, దబాయింపుతో పోటీ చేస్తున్నారని విమర్శించారు. కోర్టులో తాత్కాలికంగా ఉపసమనం ఉన్నప్పటికీ గిరిజనులు తగిన బుద్ధిచెప్తారన్నారు. గీత గతంలో ఆర్థిక నేరం కేసులు జైలు జీవితం అనుభవించారని, అటువంటి వ్యక్తి అదివాసీల ప్రయోజనాలు కాపాడుతామంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.సుబ్బరావమ్ము, సీనియర్‌ నాయకులు ఎం. కృష్ణమూర్తి, రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఎం.సూర్యనారాయణ, శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శివర్గం, జిల్లా కమిటీ నాయకులు పాల్గొన్నారు.

➡️