పింఛన్ల కోసం పడిగాపులు

అరకులోయ మండలం లోతేరు సచివాలయానికి వెళ్తున్న గిరిజనులు

ప్రజాశక్తి-పాడేరు: మన్యంలో పింఛనుదారులు అవస్థలు పడ్డారు. బుధవారం నుంచి పింఛన్ల పంపిణీ జరుగుతుందని సమాచారంతో వృద్ధులు, వితంతులు తదితర లబ్ధిదారులంతా ఉదయం నుంచే సచివాలయాలకు తరలివచ్చారు. కొందరు మధ్యాహ్నం వరకు మరికొందరు సాయంత్రం వరకు పింఛన్ల కోసం నిరీక్షించాల్సి వచ్చింది. ఉష్ణోగ్రతలు పెరిగిన నేపథ్యంలో వృద్ధులకు కాస్త అలసటతో పాటు కొన్ని గంటలపాటు నిరీక్షణ తప్పలేదు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు బుధవారం మధ్యాహ్నం నుంచి సచివాలయాల్లో సిబ్బంది పింఛన్లు పంపిణీ చేపట్టారు. కొన్నిచోట్ల నెట్వర్క్‌ సమస్య, నగదు రాకపోవడంతో తదితర కారణాలతో లబ్ధిదారులు సచివాలయాల వద్ద గంటలకు నిరీక్షించాల్సి వచ్చింది.అల్లూరి జిల్లా వ్యాప్తంగా మొత్తం ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల పింఛన్ల లబ్ధిదారులకు పింఛన్లు సొమ్ము బట్వాడా చేయవలసి ఉంది. ఈనెల ఆరవ తేదీ వరకు ఉదయం 6 నుంచి సాయంత్రం 7 గంటల వరకు బట్వాడా నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌ సచివాలయాల సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది.అల్లూరి డెస్క్‌:అరకులోయ మండలంలోని లబ్ధిదారులు పింఛన్ల కోసం పడిగాపులు కాశారు. అరకులోయ మండలం లోతేరు పంచాయితీ పరిధి తోటవలస, వివిధ గ్రామనికి చెందిన వృద్ధులు, వికలాంగులు మూడు, నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న లోతేరు గ్రామ సచివాలయం వద్దకు బుధవారం కాలినడన చేరుకున్నారు. మధ్యాహ్నం తర్వాత రావాలని సచివాలయ సిబ్బంది చెప్పడంతో వృద్ధులు, వికలాంగులు తిరిగి ఇంటికి వెళ్లలేక, ఎండకు మళ్లీ రాలేక సచివాలయం వద్ద వేచి ఉన్నారు.ప్రతి నెల 1వ తేదీన వాలంటీర్లు ఇంటికి తెచ్చి పింఛన్లు ఇచ్చేవారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో వాలంటీర్లతో పంపిణీని నిలిపేశారు. సచివాలయం వద్ద పింఛన్ల పంపిణీ జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఫించన్లు అందక అవస్థలు పడ్డారు. మండలంలో 6,630మంది పింఛనుదారులు ఉండగా సుమారు 150మందికి మాత్రమే పింఛన్లు అందేశారు. హుకుంపేట:గన్నేరుపుట్టు పంచాయతీ సచివాలయం వద్ద పింఛన్‌ల కోసం లబ్ధిదారులు పడిగాపులు కాశారు. ఉదయం నుంచి పింఛన్‌ల కోసం పడిగాపులు కాస్తూ ఇబ్బంది పడ్డారు.మండలంలో 33 పంచాయతీలు ఉండగా 4 పంచాయతీలకు మాత్రమే పింఛన్లు అందజేశారు.డుంబ్రిగుడ : పింఛన్లు తీసుకోవడానికి పంచాయతీ పరిధిలోని సచివాలయాలకు వచ్చిన గిరిజనులు పలు ఇబ్బందులు పడ్డారు. మారుమూల గ్రామం నుంచి పింఛన్ల కోసం వచ్చినా పంపిణీ కాకపోవడంతో నిరాశతో లబ్ధిదారులు వెనుదిరిగారు. మండలంలోని అరకు మేజర్‌ పంచాయతీలో పింఛన్‌ కోసం కాళ్లు చొచ్బు బడిన పింఛన్‌ లబ్ధిదారుడిని ఆటోలో సచివాలయానికి వారి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు.డబ్బులు రాక పింఛన్ల ఆగిన పంపిణీఅడ్డతీగల:ఏజెన్సీలో డబ్బులు పూర్తిస్థాయిలో రాకపోవడంతో బుధవారం జరిగాల్సిన పింఛన్ల పంపిణీ ఆగిపోయింది. అడ్డతీగల పంచాయతీకి సుమారు రూ.10.50 లక్షలు పెన్షన్‌ డబ్బులు రావాల్సి ఉండగా, 3వ తేదీ నాటికి యూనియన్‌ బ్యాంక్‌కి రూ.3 లక్షలు మాత్రమే వచ్చాయి. వాటిని డ్రా చేయడానికి సాంకేతిక లోపం ఉండడంతో అవి కూడా రాలేదని, దీంతో చేసేదేమీ లేక 4వ తేదీ నుండి పింఛన్లు పంపిణీ ప్రారంభిస్తామని పంచాయతీ అధికారులు తెలిపారు. దీంతో ఉదయం నుండి నిరీక్షించిన పింఛనుదారుల చేసేది లేక నిరాశతో వెనుదిరిగారు. మారేడుమిల్లి : పింఛన్లు ఇస్తారని బుధవారం ఉదయమే సుదూర ప్రాంతాల నుంచి సచివాలయాల వద్దకు చేరుకొని లబ్ధిదారులు నిరీక్షించారు. అయితే డబ్బు ఇంకా రాలేదంటూ సచివాలయ వెనక్కి పంపిచేశారు. దీనిపై పంచాయతీ సెక్రెటరీ పరమేశ్వరిని వివరణ కోరగా పెన్షన్‌ నగదు ఇంకా క్రెడిట్‌ కాలేదని, సాయంత్రం లోపు వస్తే ఇంటింటికి పంపించి పంపిణీ చేస్తామని చెప్పారు. చింతూరు : బ్యాంక్‌లో డబ్బులు లేక పోవడంతో చింతూరు మండలంలో పింఛన్లు పంపిణీ ఆగిపోయింది. ఈ విషయంపై చింతూరు సచివాలయం సెక్రటరీ ప్రసాద్‌ను వివరణ కోరగా బ్యాంకులో సరిపడ డబ్బులు లేనందున పించన్‌లు ఇవ్వలేక పోయామని, గురువారం అందరికీ పింఛన్లు అందజేస్తామని తెలిపారు.రాజవొమ్మంగి : సచివాలయాల్లో పింఛన్లు పంపిణీ చేస్తారని సమాచారంతో దూర ప్రాంతాల నుండి వచ్చిన లబ్ధిదారులు ఇక్కడ పింఛన్లు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. మండలంలో 6681 మంది వితంతు, వృద్ధాప్య, వికలాంగ పింఛను లబ్ధిదారులు ఉండగా, వారికి సుమారు రూ1.95 కోట్లు ప్రతి నెల చెల్లించాల్సి ఉంది. కాని ఈ మొత్తం బుధవారం రాలేదు. దీనిపై ఎంపీడీవో ను వివరణ కోరగా పింఛన్లు నగదు ఇంకా క్రెడిట్‌ కాలేదని సాయంత్రంలోపు డబ్బు వస్తే పంపిణీ చేస్తారని తెలిపారు.విఆర్‌.పురం : మండలంలో పింఛనుదారులు బుధవారం ఉదయం నుండి మధ్యాహ్నం 12 గంటల పింఛన్లు కోసం ఎదురు చూశారు. డబ్బులు బ్యాంకులో పడలేదని, నాలుగో తేదీన పెన్షన్‌ ఇస్తామని చెప్పడంతో చేసేదేమి లేక వెనుదిరిగారు.సాయంత్రం నుండి పంపిణీకూనవరం : మండలంలోని పలు పంచాయితీలలో సాయంత్రం నుండి పింఛన్ల పంపిణీ చేశారు. మండల కేంద్రంలో రాత్రి వరకు పంపిణీ కొనసాగింది. కొన్ని పంచాయితీలలో మాత్రం సుదూర ప్రాంతాలకు వెళ్లలేక పింఛను పంపిణీ జరగలేదు.

➡️