పోలింగ్‌ కు పటిష్ట ఏర్పాట్లు

bమాట్లాడుతున్న కలెక్టర్‌ విజయ సునీతో

ప్రజాశక్తి -పాడేరు : జిల్లాలో ఈనెల 13న సజావుగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ నిర్వహణకు పకడ్బందీ గా ఏర్పాట్లను పూర్తి చేసామని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎం. విజయ సునీత స్పష్టం చేసారు. సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శనివారం విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలో 7లక్షల 71 వేల 193 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. పాడేరు, రంపచోడవరం, అరకు వ్యాలీ అసెంబ్లీ నియోజక వర్గాలను 172 సెక్టార్లు విభజించి 190 మంది సెక్టార్‌ అధికారులను నియమించామన్నారు. పోలింగ్‌ అధికారులకు, సిబ్బందికి రెండు విడతలలో ఎన్నికల నిర్వహణపై సమగ్రమైన శిక్షణ అందించామని పేర్కొన్నారు. అరకు వ్యాలీ అసెంబ్లీ నియోజక వర్గానికి అరకు వ్యాలీలోను, పాడేరుకు పాడేరు డిగ్రీ కళాశాలలోను, రంపచోడవరానికి ఇవియంలు పంపిణీకి మూడు పంపిణీ కేంద్రాలను ఏర్పాట్లు చేసామని చెప్పారు. రంపచోడవరం అసెంబ్లీ నియోజక వర్గంలో రిసెప్షన్‌ కేంద్రం, అరకు వ్యాలీ, పాడేరు, అసెంబ్లీ నియోజక వర్గాలకు పాడేరులో రిసెప్షన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసామని తెలిపారు.పోలింగ్‌ సరళిని పరిశీలించడానికి 200 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించడం జరిగిందన్నారు. ప్రతీ పోలింగ్‌ కేంద్రంలోను మౌలిక సదుపాయాలు కల్పించామని చెప్పారు. జిల్లాలో ఉదయం 7గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందన్నారు. జిల్లాలో 1021 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. 695 క్రిటికల్‌ పోలింగ్‌ కేంద్రాలలో వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోలింగ్‌ సిబ్బందికి తగిన రవాణా సదుపాయాలు కల్పించామని పేర్కొన్నారు. ముందుగా లోక్‌ సభ స్థానానికి, తరువాత అసెంబ్లీ స్థానానికి ఓటు హక్కు వేయడానికి అవకాశం కల్పిస్తామన్నారు. జిల్లా ఎస్పీ తుహీన్‌ సిన్హా మాట్లాడుతూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టామని చెప్పారు. జిల్లాలో ఉన్న 1021 పోలింగ్‌ కేంద్రాలలో 610 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయని స్పష్టం చేసారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు 5400 పోలీసులను నియమించామని చెప్పారు. సమాచార సేకరణకు సిగల్‌ లేని చోట విహెచ్‌ ఎఫ్‌ సెట్లు ఏర్పాటు చేసామన్నారు. 4776 లీటర్ల నాటు సారా, 2740 లీటర్ల మద్యం సీజ్‌ చేసామన్నారు. 2424 కేజీల గంజాయి సీజ్‌ చేయడం జరిగిందన్నారు. నాలుగు నగదు కేసులను నమోదు చేసామన్నారు. 15 మంది అభ్యర్థులకు సెక్యూరిటీ సదుపాయం కల్పించామని, కౌంటింగ్‌ వరకు కొనసాగిస్తామని చెప్పారు. బయట వ్యక్తులు అనధికారంగా అతిధి గృహాలలో ఉంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

➡️