పట్టువిడవని అంగన్‌వాడీలు

కొత్తకోటలో అధికారులను అడ్డుకుంటున్న టిడిపి నేతలు

ప్రజాశక్తి – విలేకర్ల యంత్రాంగం సమస్యలను పరిష్కరించాలని శాంతియుతంగా అంగన్‌వాడీలు చేపడుతున్న నిరసనలు శుక్రవారం నాల్గో రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వం, అధికారులు అంగన్‌వాడీలను పలు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అయినప్పటికీ పట్టు వీడని అంగన్‌వాడీలు విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో ఆందోళనలు కొనసాగించారు. విశాఖ కలెక్టరేట్‌ : ప్రభుత్వం ఆశ, అంగన్‌వాడీ కార్మికులపై అక్రమ అరెస్టులు, నిర్భంధం ఆపి వారి సమస్యలను పరిష్కరించాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద అంగన్‌వాడీలు నిరసనను కొనసాగించారు. ఈ శిబిరాన్ని సందర్శించిన జగ్గునాయుడు మాట్లాడారు. పెరుగుతున్న ధరలకు అణుగుణంగా కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఇఎస్‌ఐ, పిఎఫ్‌, గ్రాడ్యూటీ, సెలవులు తదితర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. నాకు అధికారమివ్వండి ఆశ, అంగన్‌వాడీల పక్షాన నిలుస్తానని చెప్పిన జగన్‌ మాట తప్పి కార్మిక వ్యతిరేకిగా నిరూపించుకుంటున్నారని విమర్శించారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కెఎ.పాల్‌ సంఘీభావం ప్రకటించారు. పెందుర్తి : స్థానికంగా అంగన్‌వాడీలు చేపట్టిన నిరసనకు టిడిపి కార్పొరేటర్లు పీలా శ్రీనివాసరావు, బల్ల శ్రీనివాసరావు, పివి.నరసింహం మద్దతు తెలిపారు. కార్యక్రమంలో దేవి, భవాని పాల్గొన్నారు. పద్మనాభం: స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. తహశీల్దార్‌ కె.వేణుగోపాలరావుకు వినతిపత్రం అందజేశారు. సిఐటియు పూర్వ జిల్లా ప్రధాన కార్యదర్శి అజశర్మ, భీమిలి డివిజన్‌ నాయకులు ఆర్‌ఎస్‌ఎన్‌ మూర్తి, నర్సింగరావు, యూనియన్‌ జిల్లా కమిటీ సభ్యులు ఎస్‌.లక్ష్మి, ప్రధాన కార్యదర్శి అనురాధ, ప్రాజెక్ట్‌ కార్యదర్శి కె.పద్మావతి. జిల్లా కమిటీ సభ్యులు కె. వెంకటలక్ష్మి పాల్గొన్నారు.పెందుర్తి : జివిఎంసి 94వ వార్డు కృష్ణానగర్‌ అంగన్వాడీ కేంద్రం తాళాలు పగలగొట్టేందుకు వచ్చిన సచివాలయ సిబ్బందిని సమాచారం తెలుసుకున్న స్థానికులు, లబ్ధిదారులు అడ్డుకున్నారు. అంగన్వాడీలు మూడు రోజులుగా సమ్మె చేస్తున్న సమయంలో వారి లేకుండా కేంద్రం తాళాలు పగలగొట్టడం సరికాదని తిరగబడ్డారు. దీంతో సచివాలయ సిబ్బంది వెనుదిరిగారు.భీమునిపట్నం : న్యాయమైన డిమాండ్ల సాధనకు నిరధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీలు కేంద్రాల తాళాలు ఇచ్చేందుకు నిరాకరించడంతో, మూసేసిన అంగన్వాడీ కేంద్రాలను తాళాలు పగలగొట్టి బలవంతంగా తెరిపిస్తున్నారు. జివిఎంసి ఒకటో వార్డు సంత పేట అంగన్వాడీ కేంద్రం తలుపులకు వేసిన తాళాన్ని వైసిపి నాయకుల సమక్షంలో వార్డు సచివాలయ మహిళా పోలీస్‌, అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీ, వార్డు వాలంటీర్‌ ఆధ్వర్యాన శుక్రవారం సుత్తి తో బద్దలు కొట్టి తెరిచారు. .భీమిలి మండలంలో చిప్పాడ,1,2 , సిటీ నగర్‌, ఆశిపాలెం, కొసనవానిపాలెం, పెద నాగమయ్యపాలెం, చిన నాగమయ్యపాలెంఅంగన్వాడీ కేంద్రాల తాళాలను బద్దలుగొట్టి తెరిచారు. ఆశిపాలెంలో రంపంతో తాళం కోసి అంగన్వాడీ కేంద్రాన్ని తెరిచారు.ఒకటో జోన్‌లో 97 అంగన్వాడీ కేంద్రాలకు గాను 52 కేంద్రాలను తెరిచినట్లు జెడ్‌సి రాము తెలిపారు. సమ్మె చేస్తున్న అంగన్వాడీల సమస్యలను సామరస్యంగా పరిష్కరించాల్సిన ప్రభుత్వం, నిరంకుశంగా వ్యవహరించడం దుర్మార్గమని సిఐటియు భీమిలి జోన్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌ఎస్‌ఎన్‌ మూర్తి, రవ్వ నరసింగరావు ఖండించారు. తాళకోటవురట్ల:అంగన్వాడీ కార్యకర్తలు నిర్వహిస్తున్న సమ్మెను నీరు గార్చేంచేందుకు మండలంలో అధికారులు పలు ప్రయత్నాలు చేశారు. పలు కేంద్రాల వద్ద అంగన్వాడీ సూపర్వైజర్లు హైమ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు, సచివాలయ కార్యదర్శి కేంద్రాలను తెరిచేందుకు విఫల యత్నం చేశారు. కార్యకర్తలు నిలువరించడంతో సిబ్బంది వెనుతిరి గారు. ఈ కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ అధికారి సూర్యనారాయణ, కార్యదర్శి మోనిక పాల్గొన్నారు.పాయకరావుపేట:సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అంగన్‌వాడి కార్యకర్తలు సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం పాయకరావుపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి మండల పరిషత్‌ కాంప్లెక్స్‌ వరకు భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘ ప్రధాన కార్యదర్శి ఎం అప్పలరాజు మాట్లాడారు. సిపిఎం నాయకులు బత్తిన నాగేశ్వరరావు, జనసేన నాయకులు అంగులూరి శివలక్ష్మి కుమారి, నారపరెడ్డి పద్మ, ఎం సీతామాలక్ష్మి, టిడిపి నేత పెద్దిరెడ్డి చిట్టిబాబు, శీను, అంగన్వాడి యూనియన్‌ నాయకులు విజయలక్ష్మి, సుబ్బలక్ష్మి, చిన్నాల రత్నం, పద్మకుమారి, లక్ష్మీ పాల్గొన్నారు.మాడుగుల:అంగన్వాడీల సమ్మె నాలుగో రోజుకు చేరుకుంది. మాడుగుల బస్‌ కాంప్లెక్స్‌ వద్ద దీక్షా శిబిరంలో చీడికాడ మాడుగుల ప్రాజెక్ట్‌ యూనియన్‌ నాయకులు మేడపురెడ్డి జానకి, బేతా భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకొని వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. సిఐటియు నాయకులు ఇరట నరసింహమూర్తి, రొంగలి దేవుడు నాయుడు పాల్గొన్నారు.కొత్తకోట:తమ న్యాయపరమైన సమస్యల సాధన కోసం అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే బెదిరింపులకు దిగడం ఎంతవరకు సమంజసమని చోడవరం నియోజకవర్గ టిడిపి మహిళా అధ్యక్షురాలు కోట నీలవేణి గోవిందరావు ప్రశ్నించారు. కొత్తకోట గ్రామంలో అంగన్వాడీ కేంద్రం -1వ సెంటర్లో తాళాలు పగలగొట్టేందుకు వచ్చిన కార్యదర్శి కృష్ణమోహన్‌, ఐసిడియస్‌ సూపర్‌వైజర్‌ విజయ, వి ఆర్‌ఓ లక్ష్మి, సచివాలయం సిబ్బందిని తెలుగు మహిళధ్యక్షురాలు కోటనీలవేణి, పలు వురు టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. స్థానిక టిడిపి నాయకులు కోట సత్యనారాయణ, ఉగ్గిన శ్రీను, వెల్లంకి ఈశ్వరరావు, మిద్ది కనకరాజు పాల్గొన్నారు.మాకవరపాలెం:డిప్యూటీ తహశీల్దార్‌ శంకర్‌రావుకు అంగన్వాడీలు వినతిపత్రం అందజేశారు. అంగన్‌వాడీ మండల అధ్యక్షుడు ధనమ్మ మాట్లాడుతూ, పాదయాత్రలో జగన్‌ మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. నర్సీపట్నం టౌన్‌:జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం నిర్బంధంతో అణచి వేయాలని చూస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సిఐటియు జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు హెచ్చరించారు. ఐ.సి.డి.ఎస్‌ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. నర్సీపట్నం టాక్స్‌ పేయర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు త్రిమూర్తులు రెడ్డి మాట్లాడుతూ, అంగన్వాడిల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. అంగన్వాడి నాయకులు సామ్రాజ్యం, ధనలక్ష్మి, తదితరులు మాట్లాడారు. సీఐటీయూ కన్వీనర్‌ తోలేటి ఈశ్వరరావు,ఐద్వా జిల్లా ఉపాద్యక్షలు యల్‌ గౌరి, సీఐటీయూ ప్రాజెక్టుకమిటి వి.సామ్రాజ్యం,మహలక్ష్మీ,పి.వరలక్ష్మి, క్రిష్ణవేణి, రమణమ్మ, విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.రావికమతం:మండల కేంద్రంలోని శివాలయం ఆవరణలో అంగన్‌వాడీల సమ్మెకు చోడవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్‌ పివీఎస్‌ ఎన్‌ రాజు, మండల పార్టీ అధ్యక్షుడు మై చర్ల నాయుడు పలువురు కార్యకర్తలు అంగన్వాడీలకు మద్దతు తెలిపారు. నోటికి నల్ల బ్యాడ్జి ధరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పివీఎస్‌ ఎన్‌ రాజు మాట్లాడుతూ, అంగనవాడీల సమస్యలపై తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో . ప్రాజెక్టు కార్యదర్శి సత్యవేణి, జనసేన మండల పార్టీ అధ్యక్షుడు మైచర్ల నాయుడు, ప్రాజెక్టు అధ్యక్షురాలు వరలక్ష్మి పాల్గొన్నారు.గొలుగొండ:గొలుగొండలో అంగన్వాడీల సమ్మె కొనసాగింది. తహశీల్దార్‌, ఎంపిడిఒ కార్యాలయాల వద్ద ఆందోళన చేపట్టి అనంతరం తహశీల్దార్‌, ఎంపిడిఒలకు వినతిపత్రాలు అందజేశారు.సిఐటియు జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు, అంగనవాడి ప్రాజెక్టు నాయకులు సిహెచ్‌ బ్రమరాంబ, ఎం.మంగతాయారు పాల్గొన్నారు. గొలుగొండ: మండలంలోని పాతకృష్ణదేవిపేటలో అంగన్వాడీ కేంద్రాన్ని తెరిచేందుకు ఐసిడిఎస్‌ సిబ్బంది, వలంటీర్లు ప్రయత్నించారు. దీంతో జనసేన నాయకులు వారిని అడ్డుకున్నారు. సబ్బవరం : సబ్బవరం ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట ఏపీ అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌, సిఐటియు ఆధ్వర్యాన అంగన్వాడీల నిరవధిక దీక్షలు కొనసాగాయి. అంగన్వాడీలు నల్ల దుస్తులు ధరించి నిరసనలో పాల్గొన్నారు. ఇందులో పాల్గొన్న యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. నాగశేషు మాట్లాడారు. అనంతరం ధర్నాలు నిర్వహించి వినతిపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకురాలు వివి రమణమ్మ, ఎం రమణి, బి, రమణమ్మ, సిహెచ్‌ దేవి, జి అమ్మాజీ, ఉప్పాడ సత్యవతి, ఎం. గౌరేష్‌, కోటి తదితరులు పాల్గొన్నారు.కశింకోట : కశింకోటలో అంగన్వాడీలు నల్లదుస్తులు, నల్లబ్యాడ్జీలతో నాలుగో రోజు ధర్నాలో నిరసన తెలిపారు. పలువురు అంగన్వాడీలు చిన్నపిల్లలతో నిరసనలో పాల్గొన్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు దాకరపు శ్రీనివాసరావు, ఐద్వా జిల్లా నాయకురాలు. డి డి వరలక్ష్మి, యూనియన్‌ నాయకులు టి తనుజ, కృష్ణవేణి, పాల్గొన్నారు. యలమంచిలి రూరల్‌ : అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోగా బలవంతంగా అంగన్వాడి కేంద్రాలను తెరిపించడాన్ని నిరసిస్తూ యలమంచిలి తహసిల్దార్‌ కార్యాలయం వద్ద నల్ల చీరలు ధరించి శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు మాట్లాడారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్‌.రాము, యూనియన్‌ సభ్యులు జయ నారాయణమ్మ, శశికళ పాల్గొన్నారు.పరవాడ : అంగన్వాడీల నాలుగో రోజు సమ్మె సందర్భంగా శుక్రవారం పరవాడ తాసిల్దార్‌ కార్యాలయం వద్ద నల్ల చీరలు ధరించి ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పి మాణిక్యం, అంగన్వాడి యూనియన్‌ నాయకులు దేవి, రమణి పాల్గొన్నారు. అనంతరం వాళ్ళు డిమాండ్లతో కూడిన మెమోరెండాన్ని డిప్యూటీ తాసిల్దార్‌ శాంతి భూషణ్‌ రావుకు అందజేశారు.మునగపాక రూరల్‌ : మునగపాకలో చేపట్టిన అంగన్వాడీల ఆందోళన శుక్రవారం నాటికి నాలుగవ రోజుకు చేరుకుంది. శిబిరాన్ని టిడిపి నాయకులు ఆడారి కిషోర్‌, రోటరీ క్లబ్‌ అధ్యక్షులు పెంటకోట జగన్నాథం నాయుడు, ఎంవీపీ నాయుడు, భాస్కర్‌, శేషు, భరత్‌ సందర్శించి అంగన్వాడీల ఆందోళనకు సంఘీభావం తెలియచేశారు. కె.కోటపాడు : స్థానిక ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌కు ఎదురుగా అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల 4వరోజు నిరవధిక సమ్మె శిబిరాన్ని కొనసాగించారు. నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన తెలిపారు. ఈ శిబిరాన్ని జనసేన పార్టీ మాడుగుల నియోజకవర్గం సమన్వయకర్త రాయపురెడ్డి కృష్ణ, కార్యకర్తలు సందర్శించి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా కార్యదర్శి నాగశేషు, గండి నాయనబాబు, జి.కుమారి, యర్రా దేముడు పాల్గొన్నారు.మునగపాక రూరల్‌ :మండలంలోని పలు అంగన్వాడీ కేంద్రాల తాళం కప్పలను ప్రభుత్వ అధికారులు, మహిళా కానిస్టేబుల్‌ విడగొట్టడాన్ని నిరసిస్తూ అంగన్వాడీలు శ ర్యాలీ నిర్వహించి, ఆందోళన చేపట్టారు. ఎండిఓ మన్మధరావు, ఏ ఎస్‌ఐ దొర, తహసిల్దార్‌ కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు.బుచ్చయ్యపేట : అంగన్వాడీల ఆందోళన నేపథ్యంలో శుక్రవారం మండలంలోని పలు అంగన్వాడీ కేంద్రాలను తెరిపించడానికి బలవంతంగా చేసిన ప్రయత్నాన్ని పిల్లల తల్లిదండ్రులు, టిడిపి నాయకులు అడ్డుకున్నారు. బుచ్చయ్యపేట మండలం వడ్డాదిలో 8 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, శుక్రవారం ఉదయం పంచాయతీ ఈఒ లవరాజు, పలువురు సచివాలయ సిబ్బంది వాటిని తెరిపించే ప్రయత్నం చేశారు. దీంతో పిల్లల తల్లిదండ్రులు, తెలుగుదేశం పార్టీ నాయకులు సిబ్బందిని అడ్డుకున్నారు. ఐదో నెంబర్‌ అంగన్వాడీ కేంద్రం వద్దకు కొత్తకోట, బుచ్చయ్యపేట సిఐ, సిఐలు సయ్యద్‌ ఎలియాస్‌ మహమ్మద్‌, కుమారస్వామి ఆధ్వర్యాన సచివాలయ సిబ్బంది అధికారులు చేరుకున్నారు. పిల్లల తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగారు. అంగన్వాడీ కేంద్రం తాళాలను బలవంతంగా బద్దలు కొట్టి, కేంద్రాన్ని గ్రామైక్య సంఘాల మహిళలకు అప్పగించారు.వడ్డాది : పోలీసుల బెదిరింపులతో అంగన్వాడి కేంద్రాలు తాళాలు పగలగొట్టడం సరి కాదని వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు పిన పాత్రుని సాంబశివరావు ఖండించారు.

➡️