పరిహారం చెల్లించే వరకూ పనులు చేపట్టొద్దు

Feb 2,2024 23:05
పనులు అడ్డగించిన నిర్వాసితులు

ప్రజాశక్తి -నక్కపల్లి:పూర్తిస్థాయిలో పరిహారం, ప్యాకేజీ చెల్లించే వరకు ఎటువంటి పనులు చేపట్టొద్దని నిర్వాసితులు డిమాండ్‌ చేశారు. వైజాగ్‌ – చెన్నై ఇండిస్టీల్‌ కారిడార్‌ ఏర్పాటులో భాగంగా శుక్రవారం మండలంలో అమలాపురం పంచాయతీ పాటిమీద గ్రామం చందనాడ రెవెన్యూ పరిధిలో స్టార్టప్‌ ఏరియా కింద గుర్తించిన భూములలో సరిహద్దులు ఏర్పాటు చేయడానికి ఏపిఐఐసి అధికారులు జేసిబితో పనులు చేపడుతుండగా విషయం తెలుసుకున్న రైతులు, నిర్వాసితులు అక్కడకు చేరుకుని జేసిబీకి అడ్డంగా నిలబడి పనులను అడ్డగించారు. దీంతో, ఏపిఐఐసి అధికారులు, రైతుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.అప్పలరాజు రైతులకు, నిర్వాసితులకు మద్దతుగా నిలిచారు. ఏపిఐఐసి అధికారులతో మాట్లాడారు. పరిశ్రమలు ఏర్పాటు చేసి అభివృద్ధి చేయడం ఎంత అవసరమో, తరతరాలుగా భూములను నమ్ముకుని జీవిస్తున్న రైతులను ఆదుకోవడం కూడా అంతే అవసరమన్నారు. రైతుల సాగు భూములకు నష్టపరిహారం చెల్లించాలని, ఇళ్ళు కోల్పోతున్న వారికి నష్టపరిహారం, నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ప్యాకేజీ చెల్లించాలని డిమాండ్‌ చేశారు. చెట్లకు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించే వరకు భూములు జోలికి రావద్దని స్పష్టం చేశారు. రైతులకు పూర్తిస్థాయిలో పరిహారం, ప్యాకేజీ చెల్లించకుండా భూములకు సరిహద్దులు చేపట్టడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. పరిహారం, ప్యాకేజీ పూర్తి స్థాయిలో చెల్లించిన తర్వాతే పనులు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ శంకర్రావు, బి.నాగేశ్వరరావు, అప్పారావు, చిన్నమ్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

➡️