బకాయిలు చెల్లించాలని యుటిఎఫ్‌ ధర్నా

నక్కపల్లిలో ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులు

ప్రజాశక్తి -యంత్రాంగం భీమునిపట్నం : ఆర్థిక బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ యుటిఎఫ్‌ భీమిలి మండల కమిటీ ఆధ్వర్యాన బుధవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు దాసరి నాగేశ్వరరావు, గౌరవాధ్యక్షులు ఎ.పైడిరాజు మాట్లాడుతూ, ఉద్యోగుల మద్దతుతో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను విస్మరించిందన్నారు. ప్రతి నెలా 1వ తేదీన జీతాలు చెల్లించాలని, పిఆర్‌సి, ఎరియర్లు, పిఎఫ్‌ బకాయిలు, ఎపిజిఎల్‌ఐ తదితర సమస్యలు పరిష్కరించాలని కోరారు. సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్ర స్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం తVశీల్దార్‌ సిహెచ్‌వి.రమేష్‌కు యూనియన్‌ ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఉప్పాడ రాము, మండల అధ్యక్షులు ఎం.రామకృష్ణ, ఆడిట్‌ కమిటీ జిల్లా సభ్యులు అప్పల శ్రీను, నాయకులు రాంబాబు, గోవింద్‌ తదితరులు పాల్గొన్నారు పెందుర్తి : పెందుర్తి తహశీల్దార్‌ కార్యాలయం వద్ద యుటిఎఫ్‌ ఆధ్వర్యాన ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి టిఆర్‌.అంబేద్కర్‌ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు దాదాపు రూ.18 వేల కోట్ల ఆర్థిక బకాయిలు చెల్లించలేక నిలిచిపోయాయన్నారు. అవసరాల కోసం ఉపాధ్యాయులు దాచుకున్న డబ్బులను పొందలేని దుస్థితి ఏర్పడుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరచి ఆర్థిక బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండు చేశారు. అనంతరం పెందుర్తి తహశీల్దార్‌ శ్యామ్‌ ప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తడనా అప్పారావు, జిల్లా సహధ్యక్షులు ఎన్‌.ప్రభాకర్‌, రొంగలి ఉమ, జిల్లా కోశాధికారి కె.రాంబాబు, జిల్లా కార్యదర్శులు చుక్క సత్యం, నాయకులు సామా రాజులు, ఎర్రినాయుడు, బిఎన్‌.రవి, అవతారం తదితరులు పాల్గొన్నారు.నక్కపల్లి:తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు బుధవారం ఆందోళన చేపట్టారు. ప్రతి నెల ఒకటవ తేదీన జీతాలు చెల్లించాలని , పిఎఫ్‌, ఏపీజిఎల్‌ఐ బకాయిలు 18,096 కోట్లు చెల్లించాలని, , బకాయి పడ్డ డిఏలు వెంటనే చెల్లించాలని ఉపాధ్యాయులు డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని, జీవో 117ని, సిపిఎస్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు, సమస్యలు పరిష్కరించకుంటే దశలవారిగా ఆందోళన ఉదృతం చేస్తామని ఉపాధ్యాయుల స్పష్టం చేశారు. యుటిఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షులు కట్టా శ్రీనివాసరావు, జిల్లా కోశాధికారి జె రాజేష్‌ , జిల్లా ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ జి.రాజబాబు, నక్కపల్లి అధ్యక్షులు డిర్‌కె శాస్త్రి, సీనియర్‌ నాయకులు పి.వెంకటరావు, ప్రధాన కార్యదర్శి జి.మహేష్‌, కెవిసి సత్యనారాయణ, రాంబాబు, పి.దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు.

➡️