రోడ్లు విస్తరణ పనులు వేగవంతం చేయాలి

పనులపై నేతలతో మాట్లాడుతున్న ధర్మశ్రీ

ప్రజాశక్తి -కొత్తకోట: బియన్‌ రోడ్లు విస్తరణ పనులు వేగవంతం చేయాలని చోడవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ సూచించారు. కొత్తకోట లో ఇటీవల చేపట్టిన రోడ్డు విస్తరణ పనులపై ఆదివారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, గ్రామంలో సుమారు 1300 మీటర్ల మేర సిమెంట్‌ రోడ్డు వేస్తున్నట్టు చెప్పారు. స్థానిక పెద్దల విన్నపం మేరకు రోడ్డు మధ్య భాగం నుంచి అటు, ఇటుగా 30 అడుగులతో 60 అడుగులు మేర రోడ్డు విస్తరణ చేపడతామని తెలిపారు. కాంట్రాక్టర్‌, గ్రామ పెద్దలు మధ్య అవగాహనతో పనులు నిర్వహించాలని సూచించారు. ఇంత వరకు రోడ్డుకి ఇరుపక్కల ఉపాధి పొందుతున్న నాయి బ్రాహ్మణుల, పువ్వులు, కూరగాయల దుకాణాలు చెప్పులు కుట్టే కార్మికులు రోడ్డు విస్తరణతో నిరాశ్రయులయ్యారని, వారికీ మరో చోట వసతి కల్పించాలని స్థానిక వైసీపీ నాయకులు కోరగా ఎమ్మెల్యే స్పందించారు. గ్రామంలో మండల పరిషత్‌ ఆధీనంలో ఉన్న రెండు ఎకరముల 80 సెంట్ల స్థలంతో పాటు రవి థియేటర్‌ దగ్గర ఉన్న మరో 46 సెంట్లతో పాటు ఇప్పటికే పాడుబడిన షాపింగ్‌ కాంప్లెక్స్‌. ఇవన్నీ కలిపి పంచాయతీ ద్వారా తీర్మానం చేసి మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌కు పంపే ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి జీవో విడుదల చేయించి స్థానిక పంచాయితీకి హక్కులు కలిగేలా చర్యలు చేపడుతున్నట్టు ఎమ్మెల్యే పేర్కొన్నారు నాబార్డ్‌ ద్వారా రెండు కోట్ల నిధులు మంజూరుకు ప్రతిపాదనలు చేయిం చామన్నారు. నిధులు మంజూరు కాగానే షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించి నిరాశ్రయులైన వారికి అద్దెకి ఇవ్వడం జరుగుతుందన్నారు. వచ్చిన ఆదాయంతో పంచాయతీ అవసరాలు తీరుతాయని ఎమ్మెల్యే వివరించారు. విస్తరణ పనులకు ఆటంకం కలిగించే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవరించాలని పోలీస్‌, రెవెన్యూ, ఆర్‌అండ్‌బి అధికారులను ఆదేశించారు. ఆయన వెంట డిసిఎంఎస్‌ డైరెక్టర్‌ గుమ్ముడు సత్య దేవ్‌, సర్పంచ్‌ కొన లోవరాజు, ఉప సర్పంచ్‌ పందల దేవ, ఎంపిటిసి పూడి దేవ పలువురు నేతలు పాల్గొన్నారు.

➡️