శిథిలావస్థలో బాలుర వసతి గృహం

శిథిలావస్థలో ఉన్న హాస్టల్‌ భవనం

ప్రజాశక్తి -కొత్తకోట:రావికమతం మండలం కొత్తకోటలో ఎస్సి బాలుర వసతి గృహం కూలేందుకు సిద్ధంగా ఉంది. గత 30 ఏళ్ల కిందట నిర్మించిన ఈ భవనం శ్లాబ్‌ పెచ్చులూడి శిథిలావస్థకు చేరింది. ఈ వసతి గృహంలో 8, 9,10 తరగతులకు చెందిన సుమారు 90 మంది కి పైగా విద్యార్థులు ఉన్నారు. ప్రస్తుతం భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. భవనానికి తాత్కాలికంగా మరమ్మత్తులు చేపట్టక పోవడంతో భవనం శిథిలావస్థకు చేరుకుంటుంది. ఈ వసతి గృహంలో విద్యుత్‌ సమస్యతో పాటు మరుగుదొడ్లు కొన్ని పని చేయలేదు. ప్రహరీ గోడ కొంత మేర కూలేందుకు సిద్ధంగా ఉంది. వసతి గృహంలో విద్యుత్‌ సమస్య ఏర్పడినప్పు ఇన్‌వర్టర్‌ సదుపాయం లేక పోవడంతో విద్యార్థులు రాత్రి వేళల్లో చిమ్మ చీకట్లో నెట్టుకొస్తున్నారు. వసతిగృహం పై భాగంలో వాటర్‌ ట్యాంక్‌ శిథిలావస్థకు చేరి వాటర్‌ లీకేజ్‌ కావడంతో శ్లాబ్‌ తడసి రూము లోపల భాగంలో పెచ్చులూడు పడుతున్నాయి. గత కొన్నాళ్లుగా విద్యుత్‌ వైర్లలో లోపం ఏర్పడటంతో వసతి గృహాధికారి తన సొంత నిధులతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. వసతి గృహం శిథిలావస్దకు చేరుకోవడంతో ప్రైవేటు భవనంలోకి విద్యార్థులను తరలించాలన్న ప్రతిపాదనకు జిల్లాస్థాయి అధికారుల నుంచి ఎటువంటి స్పందన లభించలేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి విద్యార్థులను ప్రైవేటు భవనంలోకి తరలించి శిథిలావస్థకు చేరుకున్న వసతి గృహాన్ని మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు తెలిపారు. వాటర్‌ ట్యాంక్‌ లీకేజీని అరికట్టి సింథటిక్‌ ట్యాంకులు ఏర్పాటు చేయాలని, మరుగుదొడ్లను వినియోగంలోకి తీసుకు రావాలని కోరారు.

➡️