అంగన్‌వాడీలను విస్మరిస్తే ప్రభుత్వానికి పతనం తప్పదు

బిక్షాటన చేసి నిరసన తెలిపిన అంగన్‌వాడీలు

      అనంతపురం కలెక్టరేట్‌ : ‘అంగన్‌వాడీలు న్యాయమైన సమస్యల పరిష్కారం కోరుతూ నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వానికి విన్నవించారు. చేస్తాం.. చూస్తాం.. అంటూ కాలం నెట్టుకొస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మౌనం వహిస్తున్నారు. హక్కుల కోసం ప్రజాస్వామ్య బద్దంగా నిరసనలు చేస్తుంటే బలవంతంగా అంగన్‌వాడీ కేంద్రాలు తాలాలు పగులగొట్టి ప్రారంభిస్తున్నారు. ఇది అత్యంత దుర్మార్గమైన చర్య. సమస్యలు పరిష్కరించని ఈ ప్రభుత్వానికి పతనం తప్పదు’ అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.రాంభూపాల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్‌వాడీల సమస్యల పరిష్కారం కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం 4వ రోజుకు చేరుకుంది. అంగన్‌వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి వీడాలంటూ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. శిబిరం నుంచి కలెక్టరేట్‌ పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేసి నిరసన తెలిపారు. వాహనదారులు, చిరు వ్యాపారులు, ప్రయాణికులతో భిక్షాటన చేసి వారి మద్దతు కోరారు. కలెక్టరేట్‌ ప్రధానగేటు ఎదుట నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమస్యలు పరిష్కరిస్తారా.? అడుక్కొని సెంటర్‌లు నిర్వహించమంటారా.? అంటూ నినాదాలు చేశారు. అనంతరం అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కోశాధికారి జమున అధ్యక్షతన నిర్వహించిన సమ్మెకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.రాంభూపాల్‌, జనసేన పార్టీ రాయలసీమ కోఆర్డినేటర్‌ పెండ్యాల శ్రీలత, సిపిఎం నగర కార్యదర్శులు వి.రామిరెడ్డి, ఆర్‌వి.నాయుడు, సిఐటియు నగర కార్యదర్శులు వెంకటనారాయణ, గోపాల్‌, ముత్తుజా, ఆవాజ్‌ జిల్లా కార్యదర్శి ముస్కిన్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు గిరి, మెడికల్‌ సేల్స్‌ రెప్రజెంటేటీవ్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు సురేంద్ర, ఐద్వా రాష్ట్ర కోశాధికారి వి.సావిత్రి తదతరులు మద్దతుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాంభూపాల్‌ మాట్లాడుతూ అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్‌లను పరిష్కరించడంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తోందన్నారు. తెలంగాణా కంటే అదనంగా వేతనాలు ఇస్తామని హామీ ఇచ్చిందే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అయినప్పుడు దానిని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. సమస్యలు పరిష్కరిస్తామని అధికారులు కార్మిక సంఘాల నేతలు పిలిచి ఆర్థికేతర అంశాలపై మాత్రమే చర్చించాలంటూ మెలిక పెట్టడం మభ్యపెట్టడం కాదాన్నారు. జగన్‌ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని బెదిరిస్తూ సమ్మెను విచ్ఛిన్నం చేసే కుట్ర చేస్తోందన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల తాలాలు పగులగొట్టి దౌర్జన్యపూరితంగా అధికారులు వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అని నిలదీశారు. అరెస్టులు, బెదిరింపులతో ఉద్యమాలను ఆపలేరన్న సత్యాన్ని ప్రభుత్వం పెద్దలు తెలుసుకోవాలని హితవు పలికారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. గ్రాట్యూటీ, కనీస వేతనాలు ఇచ్చి తీరాలన్నారు. జనసేన పార్టీ రాయలసీమ కోఆర్డినేటర్‌ పెండ్యాల శ్రీలత మాట్లాడుతూ అంగన్‌వాడీల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు జనసేన సంపూర్ణ మద్దతు ఇస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నగర అధ్యక్షురాలు విజయభారతి, నాయకులు నక్షత్ర, అరీఫా, హరిప్రియ, రుక్మిణి తదితరులు పాల్గొన్నారు.

➡️