అనంతలో అంగన్‌వాడీల దీక్షా శిబిరానికి నిప్పు

Jan 16,2024 21:36

కాలిపోయిన అంగన్‌వాడీల దీక్షా శిబిరం శ్యామియానా

అనంతపురం కలెక్టరేట్‌ : అంగన్‌వాడీలు కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మె సందర్భంగా శామియానాతో శిబిరం ఏర్పాటు చేశారు. 24 గంటలు దీక్షలు చేపడుతుండటంతో రాత్రిపూట కూడా కార్మికులు అక్కడే నిద్రిస్తున్నారు. సోమవారం పండుగ రోజు కావడంతో కార్మికులు ఇళ్లకు వెళ్లిపోయారు. 36 రోజులుగా సమ్మె చేస్తున్న నేపథ్యంలో శామియానా తొలగించకుండా అలాగే ఉంచుతున్నారు. గుర్తు తెలియని దుండగులు శ్యామియానాపై నిప్పు పెట్టి తగలబెట్టారు. మొత్తం నాలుగు శ్యామియానాలు ఉండగా ఒక్క శామియానా పూర్తిగా కాలిపోయింది. కాలుతున్న సమయంలో అగ్గి మంటలు చెలరేగడంతో అటుగా వెళుతున్న వారు గమనించి మంటలు ఆర్పేశారు. దీంతో ప్రమాదం తప్పింది. కలెక్టరేట్‌ ఎదుట నిత్యం వాహన రాకపోకలతో రద్దీగా ఉండే ప్రాంతం. అలాంటి చోట ఇలాంటి సంఘటన జరగడంపై పలు అనుమానాలు తలెత్తాయి. కార్మికుల సమ్మెపై విషం చిమ్మడానికి ఎవరైనా చేశారా.. ఆకతాయిలు చేశారా..? అన్న అనుమానాలను కార్మికులు వ్యక్తం చేశారు. న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం నిరసనలు తెలుపుతున్న తమపై ఇలాంటి దాడులు చేసి, మరింత ఆరింత ఆర్థిక భారం పడేలా చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు.

➡️