‘అనంత’ అభివృద్ధి ఎంత.. సమస్యలెన్ని..!

          అనంతపురం ప్రతినిధి : అనంతపురం అర్బన్‌ నియోజకవర్గంలో అభివృద్ధి ఎంత జరిగింది… ప్రధానమైన సమస్యలకు పరిష్కారాలు లభించాయా.. అన్న చర్చ అంతటా నడుస్తోంది. ఎందుకంటే ఎన్నికల సమయం వచ్చిందంటే ఆయా పార్టీలు పోటీలు పడి హామీలిస్తుంటాయి. వాటి అమలు ఎంత వరకన్నది తెలియని పరిస్థితులుంటాయి. అనంతపురం అర్బన్‌ నియోజకవర్గంలో చూసినప్పుడు ఇక్కడ ఏ మేరకు నగరాభివృద్ధి జరిగిందన్న చర్చ నడుస్తోంది. ప్రధానమైన సమస్యలకు పరిష్కారాలు ఎంత వరకొచ్చాయన్నది కూడా చూడాల్సి ఉంటుంది.

ఎన్నికల హామీలుగా అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ

       మూడు లక్షల వరకు జనాభా కలిగిన అనంతపురం నగరంలో అండర్‌ డ్రైయినేజీ ఇప్పటికీ లేదు. ప్రతి ఎన్నిక సమయంలోనూ ప్రధాన పార్టీల నాయకులందరూ ప్రధానంగా దీనిపైనే హమీనిస్తుంటారు. ఓపెన్‌ డ్రైయినేజీతో దోమలు, మురుగు సమస్య ఉంటోంది… కాబట్టి అండర్‌ డ్రైయినేజీని తీసుకొస్తామని చెబుతుంటారు. అయితే ఇది ఇప్పటి వరకు ఎన్నికల హామీగానే మిగిలిపోయింది. 2009, 2014, 2019 ఎన్నికల సమయంలో ఈ హామీని అభ్యర్థులు ఇచ్చారు. దీని ఆచరణ, అమలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ప్రాథమిక దశ కూడా దాటిన దాఖలాలు లేవు.

డంపింగ్‌ యార్డు ప్రధాన సమస్య

         అనంతపురం నగరంలో రోజుకు వంద టన్నులపైగా చెత్త వస్తోంది. దీన్ని నగర శివారుల్లోని మార్కెట్‌యార్డు వద్ద వేస్తుంటారు. ఎప్పుడో నగరం చిన్నగా ఉన్నప్పుడు పెట్టిన ఈ యార్డులోనే చెత్త వేస్తుండటంతో పేరుకుపోయి కొండలా తయారయింది. దీన్ని ప్రాసెసింగ్‌ చేసి తగ్గించే చర్యలు కొంత చేపట్టిన పూర్తి స్థాయిలో అమలు జరగలేదు. తరచూ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. చుట్టూ జనావాలు కూడా రావడంతో ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితులున్నాయి. దీన్ని సుదూర ప్రాంతానికి తరలిస్తామని ఇచ్చిన హామీ అమలు జరగలేదు.

ప్రధాన రహదారుల విస్తరణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే

        అనంతపురం నగరంలో ప్రధానంగా ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా ఉంది. పాతూరులోని గాంధీ బజారు, తిలక్‌ రోడ్డులో రద్దీ ఎక్కువగా ఉంది. దీని విస్తరణ చేపట్టలేదు. కనీసం ప్రత్యామ్నాయ మార్గాలపైనా దృష్టి సారించిన దాఖలాల్లేవు. శాంతినర్సింగ్‌ హోమ్‌ ముందు నుంచి గుత్తి రోడ్డు కలిపే రహదారి మధ్యలోనే ఆగింది. దానికి పరిష్కారం చూపలేని స్థితిలో పాలకులున్నారు. ఇది పూర్తయితే పైన పేర్కొన్న రహదారుల్లో రద్దీని తగ్గించేందుకు వీలుంటుంది.

కొన్నింటికి పరిష్కారాలు

         ఈ ఐదేళ్ల కాలంలో కొన్నింటికి పరిష్కారాలను అయితే చేపట్టగలిగారు. ప్రధానంగా అనంతపురం నడిబొడ్డున టవర్‌క్లాక్‌ వద్ద పాత బ్రిడ్జి స్థానంలో కొత్త బ్రిడ్జి నాలుగు లైన్లతో పూర్తి చేయగలిగారు. ఈ రహదారి మొత్తాన్ని ముందనుకున్న విధంగా విస్తరించలేకపోయినా చాలా వరకు పనిని మాత్రం పూర్తి చేయగలిగారు. అదే విధంగా గుత్తిరోడ్డును నాలుగు లైన్ల రహదారిగా రూపొందించారు. వీటితోపాటు ప్రధాన రహదారులను కొంత వరకు మెరుగు చేపట్టగలిగారు. రాజీవ్‌కాలనిలోనూ ప్రధాన రహదారుల నిర్మాణం ఈ ఐదేళ్ల కాలంలో పూర్తి చేయగలిగారు.

➡️