అనంత సీటును చంద్రబాబుకు కానుకగా ఇద్దాం

టిడిపి విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతున్న ప్రభాకర్‌చౌదరి

          అనంతపురం కలెక్టరేట్‌ : రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అనంతపురం అర్భన్‌ నియోకవర్గం ఎన్డీఏ కూటమి నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నామని, ఈసీటును గెలిచి చంద్రబాబు నాయుడుకు కానుకగా ఇద్దామని అర్భన్‌ నియోజకవర్గం ఇన్‌ఛార్జి వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి తెలియజేశారు. బుధవారం నాడు రాయల్‌ ఫంక్షన్‌ హాల్‌లో టిడిపి అర్భన్‌ విస్తతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి పొత్తు ధర్మంలో భాగంగా అనంతపురం అర్భన్‌ ఎమ్మెల్యే సీటుపై చర్చించారని తెలిపారు. బూత్‌ స్థాయి నుంచి టిడిపి కేడర్‌ పటిష్టంగా ఉన్న నేపథ్యంలో కూటమి అభ్యర్థిగా టిడిపికి చెందిన వారికే సీటు కేటాయించబోతున్నారని తెలిపారు. ప్రతిపక్ష సమయంలో అధికార పార్టీ ఆగడాలు, అన్యాయాలను ఎదురించి కార్యకర్తలను కాపాడుకుంటూ తాను పని చేస్తూ వచ్చానన్నారు. ఎన్నికలకు సంబంధించి 40 రోజుల పాటు సమిష్టిగా ప్రజలతో మమేకమై పని చేయాలన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం, అనంతపురం అర్భన్‌లో టిడిపి జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పని చేయాలని పిలుపునిచ్చారు. టిడిపి ప్రభుత్వ పాలనలో ఐదు సంవత్సరాలు అనంతపురం అర్భన్‌లో అభివృద్ధి, సంక్షేమం చేసి చూపించామన్నారు. చేసిన పనిని ప్రజలకు చెప్పుకోవడంలో విఫలం చెందామన్నారు. అందుకే 2019 ఎన్నికల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చిందన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మ్యానిఫెస్టోను ప్రతి ఇంటికీ చేరవేసి ఓట్లు రాబట్టాలన్నారు. అర్బన్‌ టికెట్‌ విషయంలో నెలకొన్న గందరగోలానికి తెర ఎప్పుడంటూ కార్యకర్తలు ప్రశ్నించగా ‘ఎమ్మెల్యే సీటు నాదే.. గెలుపు మనదే’ అని ప్రభాకర్‌ చౌదరి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు సాలార్‌ బాషా, సాకే గంపన్న, తలారి ఆదినారాయణ, దేవళ్ల మురళి, మారుతి కుమార్‌ గౌడ్‌, డిష్‌ నాగరాజు, సరిపూటి రమణ, నటేష్‌ చౌదరి, గాజుల ఆదెన్న, రాజారావు, స్వప్న, విజయశ్రీ రెడ్డి, సరళ, జానకి, కష్ణవేణి, వసుంధర పాల్గొన్నారు.

➡️