ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటా : జెసి

Dec 31,2023 22:16

వీరాపురం గ్రామస్తులతో మాట్లాడుతున్న పోలీసులు

      తాడిపత్రి రూరల్‌ : తాడిపత్రి పెన్నా నది పరివాహక ప్రాంతాల నుంచి అక్రమంగా బిల్లులు లేకుండా చేస్తున్న ఇసుక రవాణాను తక్షణమే ఆపేయాలని, లేకుంటే తాము అడ్డుకుంటామని తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే జెసి.ప్రభాకర్‌రెడ్డి తెలియజేశారు. ఆదివారం మండల పరిధిలోని వీరాపురం గ్రామ సమీపంలో పెన్నానది నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్లను గ్రామస్తుల సాయంతో జెసి.ప్రభాకర్‌ రెడ్డి అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ గ్రామస్తులను ఇబ్బంది పెడితే తక్షణమే ఇసుక రవాణా చేస్తున్న వాహనాల టైర్ల నుంచి గాలి తీసేయాలని గ్రామస్తులకు తెలియజేశారు. పెన్నా నది నుంచి ఇసుక తోడుతున్న హిటాచి, రెండు టిప్పర్లను అడ్డుకుని అక్కడే ఆపేశారు. ఈ విషయం తెలుసుకున్న రూరల్‌ పోలీసులు టిప్పర్లకు సచివాలయం ద్వారా ఇచ్చిన బిల్లులు ఉన్నాయంటూ సిఐ లక్ష్మికాంత్‌ రెడ్డి జెసి ప్రభాకర్‌ రెడ్డికి తెలిపారు. సచివాలయ అధికారులు, తహశీల్దార్‌, రాయల్టీ అధికారుల నుంచి అనుమతి పత్రాలు చూపించేంత వరకు వాటిని కదలనివ్వమని పోలీసులకు జెసి తెలిపారు. ఉన్నతాధికారాల నుంచి సరైన అనుమతులతో ఉన్న పత్రాలు చూపించేంత వరకు హిటాచీ, టిప్పర్లను రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉంచాలన్నారు. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోని పక్షంలో జనవరి 2వ తేదీన పోలీస్‌ స్టేషన్‌, తహశీల్దార్‌, రాయల్టీ కార్యాలయాల వద్ద ఆందోళన చేపడతామని జెసి తెలిపారు.

➡️