ఎన్నికలకు అన్నివిధాలా సన్నద్ధం

శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గౌతమి

        అనంతపురం కలెక్టరేట్‌ : త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధింఇ అధికారులు అన్ని విధాలా సన్నద్ధం కావాలని, ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాలని కలెక్టర్‌ ఎం.గౌతమి, ఎస్పీ కెకెఎన్‌.అన్బురాజన్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరంలోని జెఎన్‌టియు ఆడిటోరియంలో సాధారణ ఎన్నికలు-2024లో భాగంగా ఎస్‌ఎస్టీ, వీఎస్టీ, వీవీటీ, ఎఫ్‌ఎస్టీ, ఎంసీసీ బృందాలకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సాధారణ ఎన్నికల్లో ఎస్‌ఎస్టీ, వీఎస్టీ, వీవీటీ, ఎఫ్‌ఎస్టీ, ఎంసీసీ అధికారులు, సిబ్బంది ముఖ్యపాత్ర వహించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల అయ్యాక ఆయా బృందాల అధికారులు అన్ని విధాల సన్నద్ధమై ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను తూచాతప్పకుండా అమలు చేయాలన్నారు. ఎన్నికల్లో మద్యం, డబ్బు, ఇతర వస్తువులు రవాణా కాకుండా ఐటీ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖలు కీలకపాత్ర పోషించాలన్నారు. స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులకు ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత ఆర్వో, డిఇఒకి తెలపాలన్నారు. ఎస్పీ అన్బురాజన్‌ మాట్లాడుతూ సాధారణ ఎన్నికల్లో లాఅండ్‌ఆర్డర్‌ పక్కాగా అమలు చేయాలన్నారు. ఎన్నికలు సజావుగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు కషి చేయాలన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ సీఈవో వైఖోమ్‌ నిదియా దేవి, డిఆర్‌ఒ జి.రామకృష్ణారెడ్డి, డీఆర్డీఏ పీడీ నరసింహారెడ్డి, వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

➡️