ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం

ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం

సమావేశంలో మాట్లాడుతున్న ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి శ్రీనివాసులురెడ్డి

ప్రజాశక్తి-గుంతకల్లు

త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం చేశామని నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి శ్రీనివాసులురెడ్డి తెలిపారు. గురువారం స్థానిక రెవెన్యూ డివిజినల్‌ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన మేరకు మార్చి 16 నుంచి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందన్నారు. ఏప్రిల్‌ 18న ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడుతుందన్నారు. 25వ తేదీ వరకూ నామినేషన్ల స్వీకరణ, 26న పరిశీలన, 29న ఉపసంహరణ ఉంటాయన్నారు. మే 13న పోలింగ్‌, జూన్‌ 4న కౌంటింగ్‌ ఉంటుందన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమాల్ని అమలు చేసేందుకు మూడు మండలాల ఎంపిడిఒలు, రెండు మున్సిపాలిటీల కమిషనర్లను కలిపి ఐదు టీంలను ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేసి వారి వాహనాలకు జిపిఎస్‌ సిస్టం కూడా ఏర్పాటు చేశామన్నారు. వీడియో సర్వేలైన్స్‌ కూడా నియమించామన్నారు. కాగా రాజకీయ పార్టీల నాయకులకు మద్దతుగా వాలంటీర్లు, రేషన్‌ షాపుల డీలర్లు, ఎండిఎస్‌ వాహనాల సిబ్బంది ప్రచారాలు చేస్తే వారిని తొలగించడమే కాకుండా క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కాగా ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు సభలకు ర్యాలీలకు వాహనాల అనుమతులకు 48 గంటలకు ముందు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అనుమతుల మంజూరు కోసం సింగిల్‌విండో విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో గుంతకల్లు, గుత్తి, పామిడి మండలాల తహశీల్దార్లు శేషఫణి, భారతి, చంద్రశేఖర్‌నాయక్‌, ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్‌ ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు.

➡️