కదిలొచ్చిన తెలుగు తమ్ముళ్లు

ఉరవకొండలో నిర్వహించిన రా కదలి రా బహిరంగ సభలో ప్రసంగిస్తున్న చంద్రబాబు నాయుడు

            అనంతపురం ప్రతినిధి : తెలుగుదేశం పార్టీ చేపట్టిన ‘రా కదలిరా’ సభకు తెలుగు తమ్ముళ్లు కదిలొచ్చారు. టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు చేపట్టిన ఈ సభకు జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా తరలొచ్చారు. ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ అధ్యక్షతన జరిగిన సభ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు అధికార వైసిపిపై విమర్శలు గుప్పిస్తూనే, తాము అధికారంలోకి వస్తే ఏమి చేయబోతున్నామన్న వాగ్ధానాలు చేశారు. జిల్లాలోనున్న సమస్యలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. అదే సమయంలో అధికార వైసిపి ప్రజాప్రతినిధులపైనా ఆరోపణలు చేశారు. అనంతపురం జిల్లాకు సాగునీటికి అధిక ప్రాధాన్యతనిస్తామని హామీనిచ్చారు. ప్రతి ఎకరానికి నీరివ్వడమే తన లక్ష్యమని హామీనిచ్చారు. ఇది వరకే హంద్రీనీవా ప్రవాహ సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నం చేసినట్టు గుర్తు చేశారు. అవి ఇప్పుడు మధ్యలోనే ఆగిపోయాయని వాటిని పూర్తి చేస్తామని తెలిపారు. అదే విధంగా బిందు తుంపెర సేద్యానికి అధిక ప్రాధాన్యతినిస్తామన్నారు. తెలుగుదేశం అధికారంలోనున్న సమయంలో ఉరవకొండ నియోజకవర్గం పరిధిలో చేపట్టిన సాముహిక బిందు సేద్యం ప్రాజెక్టును ఈప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. రూ.30 కోట్ల విలువైన డ్రిప్‌ పరికరాలు వృథాగా పడి ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టును వైసిపి పూర్తి చేసి ఉంటే 50 వేల ఎకరాలకు సాగునీరందిందేని చెప్పారు. భైరవానితిప్ప, పేరూరు ఎత్తిపోతల పథకాలను తాము చేపడతామన్నారు. అనంతపురం జిల్లా వాణిజ్య పంటలకు అవనువైనదని చెప్పారు. బిసిలు అధికంగానున్న అనంతపురం జిల్లాలో వారికి దన్నుగా టిడిపి ఉంటుందని తెలిపారు. ఇదే సందర్భంలో అనంతపురం జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలపైనా అవినీతి ఆరోపణలు అధికంగానున్నాయన్నారు. భూకబ్జాలు దౌర్జన్యాలు అధికమయ్యాయని ఆరోపించారు. బ్రహ్మసముద్రం మండలంలో శుక్రవారం నాడు జరిగిన మహిళపై దాడిని ప్రస్తావించారు. ఈ ఆరోపణలున్న ఎమ్మెల్యేలను పక్క నియోజకవర్గాలకు బదిలీ చేస్తే ప్రయోజనమేముంటుందని మంత్రి ఉషచరణ్‌ శ్రీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తప్పు చేసిన వారు ఎవరినీ తాము అధికారంలోకి వచ్చాక వదిలిబెట్టబోమని హెచ్చరించారు. ఈ కాలంలో టిడిపి కార్యకర్తలు అనేక ఇబ్బందులు ఎదుర్కొనారన్నారు. అయినా పార్టీకి అండగా నిలిచారన్నారు. అందరూ సమిష్టిగా కలపి ఈ 76 రోజులు పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జనసేనను కలుపుకుని పనిచేయాలని సూచించారు. జిల్లా సమస్యలను ప్రస్తావించడంతోపాటు రాష్ట్ర వ్యాప్త సమస్యలపైనా మాట్లాడారు. వైసిపి ప్రభుత్వ పాలనను నిశితంగా దుయ్యబట్టారు. ఆ సమయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలను స్పందన కనిపించింది. మొత్తంగా టిడిపి సభ విజయవంతం కావడం పట్ల ఆ పార్టీ నేతల్లోనూ ఉత్సహం నెలకొంది. చంద్రబాబు మాట్లాడటానికి ముందు పయ్యావుల కేశవ్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టిడిపి అనంతపురం జిల్లా అధ్యక్షులు కాలవ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

రాత్రికి ఉరవకొండలోనే బస

ఉరవకొండ సభ అనంతరం టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు రాత్రికి అక్కడే బస చేశారు. ఆదివారం ఉదయం ఇక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి నెల్లూరుకు వెళ్లనున్నారు.

చరిత్రను తిరిగి రాద్దాం : కేశవ్‌

     రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉరవకొండ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో టిడిపి జెండాను ఎగురవేసి చరిత్రను తిరగరాద్దామని పీఏసీ ఛైర్మన్‌, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ అన్నారు. ఉరవకొండలో నిర్వహించిన రాకదలిరా బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 1994వ సంవత్సరంలో ఉరవకొండ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ గెలిచి ప్రభంజనం సష్టించి అధికారాన్ని చేపట్టిందని గుర్తు చేశారు. 2024లో అదే పునరావృతం కాబోతోందన్నారు. నారా చంద్రబాబు నాయుడు సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు.

➡️