కార్మికులు ఏకం కావాలి

కార్మికులు ఏకం కావాలి

లెనిన్‌ శత వర్థంతి పుస్కకాన్ని ఆవిష్కరిస్తున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌

అసమాన వ్యవస్థను మార్చేందుకు కార్మికులంతా ఏకం కావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.రాంభూపాల్‌ పిలుపునిచ్చారు. ఈమేరకు మంగళవారం నగరంలోని గణేనాయక్‌ భవన్‌లో లెనిన్‌ శత వర్థంతి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 21న ప్రపంచ వ్యాప్తంగా లెనిల్‌ శత వర్థంతిని నిర్వహించుకోనున్నట్లు తెలిపారు. పెట్టుబడిదారీ వ్యవస్థ కొద్దిమందిని మాత్రమే సంపన్నులుగా చేస్తుందని, అత్యధిక మందిని పేదరికం దారిద్య్రంలో ముంచుతుందని మార్క్సిజం బోధిచిందన్నారు. ఈనేపథ్యంలో అసమాన వ్యవస్థను మార్చేందుకు ప్రపంచ కార్మికులంతా ఏకం కావాలని కార్ల్‌మార్క్స్‌ పిలుపునివ్వగా, లెనిన్‌ రష్యాలో అలాంటి సోషలిజాన్ని నిర్మించి మార్సిజం సిద్ధాంతం మాత్రమే కాదని ఆచరణకు మార్గదర్శని రుజువు చేశారని గుర్తు చేశారు. భారతదేశంలో ఆదాని అంబానీల ఆస్తులు ప్రపంచ కుబేరుల స్థాయికి పెరగగా, ప్రజలు మాత్రం ఆకలి, నిరుద్యోగంతో కునారిల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆకలి సూచికలో దేశం 129వ స్థానానికి దిగజారడం ఇందుకు నిదర్శనమన్నారు. అధికార రాజకీయ పార్టీలను మార్చడం ద్వారా సమస్యలు పరిష్కారం కావని, సమాజాన్ని సమూలంగా మార్చడమే అంతిమ పరిష్కారం అన్నారు. ఇందుకు సోషలిజమే సరైన మార్గం అని అభిప్రాయపడ్డారు. ఆ మార్గాన్ని అనుసరించడానికి, మార్క్సిజం సిద్ధాంతాన్ని లోతుగా అధ్యయనం చేయడానికి ఇది సరైన సందర్భం అన్నారు. కావున లెనిన్‌ చూపిన మార్గంలో నడిచి దేశంలో సోషలిస్టు వ్యవస్థ నిర్మించేందుకు కష్టజీవులందరూ ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఓ.నల్లప్ప, ఎం.బాల రంగయ్య, వి.సావిత్రి, ఎస్‌.నాగేంద్రకుమార్‌ పాల్గొన్నారు.

➡️