కేంద్ర కరువు బృందం కరుణించేనా ?

కేంద్ర కరువు బృందం పర్యటనపై అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ గౌతమి

         అనంతపురం ప్రతినిధి : ఈ ఏడాది ఖరీఫ్‌లో నెలకొన్న కరువు పరిస్థితులను పరిశీలించేందుకు కేంద్ర కరువు బృందాలు ఉమ్మడి అనంతపురం జిల్లాకు విచ్చేయనున్నాయి. సోమవారం రాత్రికే అనంతపురం చేరుకున్న బృందాలు మంగళ, బుధవారాల్లో అనంతపురం, సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నాయి. బృందం సభ్యులు వర్షాభావంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించనునన్నారు. ఇప్పటికే బృందాల పర్యటనకు సంబందించి రూట్‌ మ్యాప్‌లు ఖరారయ్యాయి. కేంద్ర బృందం తొలిరోజు మంగళవారం నాడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ జాయింట్‌ సెక్రటరీ పంకజ్‌ నేతృత్వంలో కరువు బృందం కరువు పరిశీలన చేయనుంది. పదిమంది సభ్యులు ఈ బృందంలో ఉన్నారు. మూడు బృందాలుగా విడిపోయి ఈ బృందం పర్యటన చేయనున్నట్టు సమాచారం.

కేంద్ర కరువు బృందం కనికరించేనా ?

     కరువు ప్రకటనలు వెలువడిన ప్రతిసారీ బృందాలు పర్యటించడం, వెళ్లడం సర్వసాధారణమైన అంశంగా ఉంటోంది. సాయం మాత్రం నామమాత్రంగానే ఉంటోందన్న విమర్శ ఉంది. ఈసారి పర్యటించే బృందం ఏ మేరకు కరుణిస్తుందన్నది చూడాల్సి ఉంది. ఈ ఏడాది ఇప్పటి వరకు చూసుకున్నా వర్షాభావ పరిస్థితులే నెలకొన్నాయి. అనంతపురం జిల్లాలో 36 శాతం వర్షపాతం లోటుండగా, సత్యసాయి జిల్లాలో 30 శాతం వర్షపాతం లోటుంది. ప్రధానంగా ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం జులై, ఆగస్టు మాసాల్లో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు అనంతపురం జిల్లాలో నెలకొన్నాయి. వంద ఏళ్లలో ఎప్పుడూ లేనంత తక్కువ వర్షపాతం ఈసారి ఆగస్టులో నెలకొంది. సాధారణ వర్షపాతం ఆగస్టు నెలలో 83.3 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా 13.7 మిల్లీమీటర్లు మాత్రమే పడింది. 83.7 శాతం వర్షపాతం లోటు ఏర్పడింది. వందేళ్లలో ఇంత తక్కువ వర్షపాతం ఆగస్టులో నమోదవడం ఇదే ప్రథమం. ఖరీఫ్‌ పంటల సాగుకు కీలకమైన ఆగస్టులో వర్షభావం మూలంగానే ఉమ్మడి అనంతపురం జిల్లాలో పంటల సాగుపై తీవ్ర ప్రభావం పడింది. వేసిన పంటలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. అనంతపురం జిల్లా సాధారణ సాగు 9.66 లక్షల ఎకరాలకుగానూ 6.34 లక్షల ఎకరాల్లోనే సాగైంది. సాధారణ సాగులో ఇది 67 శాతమే కావడం గమనార్హం. సత్యసాయి జిల్లాలో మరింత తక్కువ సాగైంది. 7.12 లక్షల ఎకరాలకుగానూ 2.58 లక్షల ఎకరాల్లోనే విత్తనం పడింది. అంటే సాధారణ సాగులో 35 శాతమే పంటలు సాగయ్యాయి. ఇందులో ప్రధాన పంట వేరుశనగ పూర్తిగా దెబ్బతింది. అనంతపురం జిల్లాలో 2.28 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగవగా, సత్యసాయి జిల్లాలో కేవలం 1.77 లక్షల ఎకరాల్లోనే సాగైంది. ఈ పంట సాగుకు ఎకరానికి రూ.40 వేల వరకు ఖర్చ రాగా రైతుకు దక్కిన ప్రతిఫలం రెండు బస్తాల విత్తనకాయలు కూడా రాలేదు. దీంతో పూర్తిగా రైతులు నష్టపోయి ఉన్నారు. పత్తి ఆముదం తదితర పంటల పరిస్థితి కూడా ఇదే తీరుగా ఉంది.

ఇప్పటికే అంచనాలు

    పంటనష్టంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అంచనాలను రూపొందించింది. అనంతపురం జిల్లాలో రూ.251 కోట్లు నష్టం వాటిల్లినట్టు అంచనాలు రూపొందించి రాష్ట్రప్రభుత్వానికి నివేదించింది. ఇవి కాకుండా తాగునీటి కష్టాలు, కరువు సమయాల్లో వలసలు పోకుండా ఆదుకునే చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. వీటన్నింటికీ ఎన్ని నిధులు అవససరమవుతాయన్న ప్రతిపాదనలను జిల్లా యంత్రాంగం కరువు బృందం ముందు ప్రతిపాదించేందుక సిద్ధమైంది. నేడు జల్లా కలెక్టరేట్‌లో ఉదయం జరిగే సమీక్షల్లో కరువు బృందం ముందు అధికారులు ప్రతిపాదించనున్నారు.

➡️