‘తోపుదుర్తి’ చుట్టూ హౌసింగు వివాదం..!

ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి

       అనంతపురం ప్రతినిధి : అనంతపురం రూరల్‌ మండల పరిధిలోని కొడిమి వద్దనున్న హౌసింగ్‌ లేఅవుట్‌ కార్మికులను రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి కిడ్నాప్‌ చేసారంటూ పెద్దఎత్తున ప్రచారం నడిచింది. ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి, పోలీసులు మాత్రం ఎటువంటి కిడ్నాప్‌ లేదని దురుద్ధేశంతో కొంత మంది చేస్తున్న దుష్పప్రచారమని కొట్టి పారేశారు. శనివారం ఉదయం నుంచి ఈ అంశం జిల్లాలో పెద్ద దుమారమే రేగింది. ఈ వివాదానికి సంబందించి వారివారి వాదనలు ఇలా ఉన్నాయి.

డబ్బులివ్వలేదని కార్మికుల కిడ్నాప్‌

కాంట్రాక్టర్‌ సర్వర్‌ జహా

         తాను అడిగినంత డబ్బులివ్వలేదని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, ఆయన బామ్మర్ధి కలిపి తన సంస్థకు సంబంధించిన తొమ్మిది మంది కార్మికులను నిర్బంధించారని లేబర్‌ కాంట్రాక్టర్‌ సర్వర్‌ జహా ఆరోపిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో జిల్లాలో పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది. కనబడకుండా పోయిన తొమ్మిది కార్మికులను విడిపించాలని పశ్చిమబెంగాల్‌ ఎంపి ఒకరు జిల్లా అధికారులకు రాసిన ఉత్తరం వాట్సప్‌ గ్రూపుల్లో సర్క్యులేట్‌ అయ్యింది. తన లాయర్‌ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు కాంట్రాక్టర్‌ సర్వర్‌ జహా వీడియోలో పేర్కొన్నారు.

కార్మికులు ఎక్కడికీ పోలేదు

డీఎస్పీ శివారెడ్డి.

   కార్మికులు అదృశ్యం అయ్యారని ప్రచారం జరుగుతుండటం అవాస్తవమని అనంతపురం రూరల్‌ డీఎస్పీ శివారెడ్డి తెలిపారు. సమాచారం తెలిసిన వెంటనే కొడిమి లేఅవుట్‌ ప్రాంతంలో పర్యటించామంటూ ఒక వీడియోను విడుదల చేశారు. మాయమ్యారని చెబుతున్న తొమ్మిది మంది కార్మికులు క్షేమంగా ఉన్నారని తెలిపారు. వీరెవరూ కిడ్నాప్‌కు గురవలేదని, వారిపనులు వారు చేసుకుంటున్నారన్నారు. కిడ్నాప్‌ అంటూ తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు.

కావాలనే దుష్‌ప్రచారం

ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి

     కావాలనే తెలుగుదేశం నాయకులు, కొంత మంది పనిగట్టుకుని తనపై దుష్‌ప్రచారాలు చేస్తున్నారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం ఆయన అనంతపురంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గృహ నిర్మాణాలను వేగవంతం చేయించేందుకు సొంత డబ్బులు ఖర్చు పెట్టానన్నారు. రాజకీయంగా ఎదుర్కొనలేక తెలుగుదేశం నాయకులు ఇలాంటి అబద్దపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. సర్వర్‌ జహా అనే కాంట్రాక్టరే డబ్బులు తీసుకుని పనిచేయకుండా పారిపోయారన్నారు. అదృశ్యం అయ్యారని చెబుతున్న కార్మికులు పనులు చేసుకుంటున్నారన్నారు. రాజకీయంగా ఎదుర్కొనలేక తాను వందల కోట్లు సంపాదించాననే అర్థంలేని ఆరోపణలు కొందరు చేస్తున్నారన, ప్రజలెవరూ వీటిని పట్టించుకునే పరిస్థితుల్లో లేరన్నారు.

➡️