ధర్మవరం టిక్కెట్‌పై తమ్ముళ్ల అసంతృప్తి

బికె.పార్థసారధి ఇంటి వద్ద అందోళన చేస్తున్న పరిటాల శ్రీరామ్‌ మద్దతుదారులు

           అనంతపురం ప్రతినిధి: ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం టిక్కెట్టును పొత్తుల్లో భాగంగా బిజెపికి కేటాయించడంపై తెలుగు తమ్ముళ్లు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ధర్మవరం టిక్కెట్టు పరిటాల శ్రీరామ్‌కు కాకుండా బిజెపికి పొత్తుల్లో ఇవ్వడం సరైంది కాదంటూ ఆందోళనకు దిగారు. శుక్రవారం ఉదయం అనంతపురం నగరంలోని సత్యసాయి జిల్లా టిడిపి అధ్యక్షులు బికె.పార్థసారధి ఇంటి ముందు బైఠాయించిన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ ధర్మవరం నియోజకవర్గంలో ఐదేళ్లు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన శ్రీరామ్‌కు కాకుండా ఎన్నికల్లో ఓడిపోగానే టిడిపి నుంచి బయటకుపోయి బిజెపిలో చేరిన జి.సూర్యనారాయణకు ఎలాగిస్తారని మండిపడ్డారు. చంద్రబాబు డబ్బున్న వాళ్లకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారాని ప్రశ్నించారు. శ్రీరామ్‌కు టికెట్టు విషయంలో స్పష్టమైన హామీనిచ్చే వరకు కదిలేది లేదన్నారు. దీనిపై బికె.పార్థసారధి స్పందిస్తూ టికెట్టు విషయం తన చేతుల్లో లేదని… తన సీటుకే దిక్కులేదని, తానెవరికి చెప్పాలని ఎదురు ప్రశ్నించారు. ఏదైనా ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానంటూ బికె.పార్థసారధి తెలియజేశారు. కాగా ధర్మవరం సీటు శ్రీరామ్‌కు కేటాయించాలని కోరుతూ శనివారం నాడు ధర్మవరం పట్టణంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించి భవిష్యత్తు ప్రణాళిక ప్రకటిస్తామని టిడిపి నాయకులు తెలియజేశారు.

➡️