ప్రజలపై భారాలు మోపొద్దు : సిపిఎం

ప్రజలపై భారాలు మోపొద్దు : సిపిఎం

సమావేశంలో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వి.రాంభూపాల్‌

        అనంతపురం కలెక్టరేట్‌ : కార్పొరేట్‌కు మేలు చేస్తూ ప్రజలు, రైతులపై భారాలను మోపే చర్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.రాంభూపాల్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం గణేనాయక్‌ భవన్‌లో సిపిఎం జిల్లా కమిటీ సమావేశాన్ని జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఓ.నల్లప్ప అధ్యక్షతన నిర్వహించారు. అనంతరం రాంభూపాల్‌ విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రీవ్యాంప్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ స్కీమ్‌(ఆర్‌డిఎస్‌ఎస్‌) అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటును ఉప సంహరించాలన్నారు. విద్యుత్‌ భారాలతో బాధపడుతున్న వినియోగదారులపై తాజాగా ప్రతిపాదించిన రూ.7200 కోట్లు ట్రూఆప్‌ భారాన్ని రద్దు చేయాలన్నారు. విద్యుత్‌ సంస్కరణ చట్టం పేరుతో క్రాస్‌ సబ్సిడీ విధానం ఎత్తివేసి, విద్యుత్‌ పంపిణీ పూర్తిగా ప్రయివేట్‌ చేయాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి అమలు చేయిస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్‌ ప్రయోజనాల కోసం డైనమిక్‌ ప్రైసెస్‌ పేరుతో ఎక్కువ ధరకు విద్యుత్‌ కొనడం ద్వారా ప్రజలపై భారాలు పెరుగుతున్నాయని తెలిపారు. వ్యవసాయ పంప్‌ సెట్లకు మీటర్ల ఏర్పాటుతో అదనపు ప్రయోజనం చేకూరలేదన్నారు. వినియోగదారులకు భారంగా, కార్పొరేట్‌లకు లబ్ధి చేకూర్చే స్మార్ట్‌ మీటర్ల్‌ విధానాన్ని ఉపసంహరించు కోవాలన్నారు. ఇప్పటికే విద్యుత్‌ భారాలను పెంచిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఎపిఇఆర్‌సికి 2020-23 సంబంధించి రూ.7200 కోట్లను ట్రూఆప్‌ డిస్కమ్‌లు ప్రతిపాదించడం దారుణంగా ఉందన్నారు. ట్రూఆఫ్‌ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలన్నారు. కరువు సహాయక చర్యలు వెంటనే చేపట్టాలి.?జిల్లాలో 28 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి సుమారు నెల రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టలేదని వెంటనే రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలన్నారు. పంట నష్టపోయిన ప్రతి ఎకరాకూ రూ.50 వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర కరువు బృందాలు జిల్లాలో పర్యటించి తక్షణ సహాయం ప్రకటించేలా రాష్ట్రం ఒత్తిడి తీసుకురావాలన్నారు. వలసలను నివారించి, వ్యవసాయ కూలీలను ఆదుకోవడానికి జాతీయ ఉపాధి హామీ పనులను 200 రోజులకు పెంచాలన్నారు. జిల్లాలో కరువుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.బాలరంగయ్య, ఎస్‌.నాగేంద్రకుమార్‌, బి.శ్రీనివాసులు, జిల్లా కమిటీ సభ్యులు వి.రామిరెడ్డి, ఆర్‌వి.నాయుడు, డి.శ్రీనివాసులు, చంద్రశేఖర్‌రెడ్డి, భాస్కర్‌, రంగారెడ్డి, నాగమణి, అచ్యుత్‌, ముస్కిన్‌, వెంకటనారాయణ, సూర్యచంద్ర తదితరులు పాల్గొన్నారు.

➡️