మళ్లీ కోవిడ్‌ భయాలు..!

Dec 22,2023 23:07

             అనంతపురం ప్రతినిధి : కోవిడ్‌ మహమ్మారి మరోమారు భయపెట్టేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో నాలుగు కేసులు నమోదయిన నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తమవుతోంది. జిల్లాలోనూ అధికార యంత్రాంగం అప్రమత్తమవుతోంది. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చే వారిపై దృష్టి సారిస్తున్నారు. ప్రధానమైన ఆసుపత్రుల్లో ఇప్పటికే కోవిడ్‌ చికిత్సకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ప్రాథమిక చికిత్స కేంద్రాలకు ర్యాపిడ్‌ టెస్టులకు అవసరమైన పరికరాలు ఏర్పాటుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. కోవిడ్‌ మొదటి, రెండు దశల్లో అనంతపురం జిల్లాలో పెద్దఎత్తున వ్యాప్తి చెందింది. రాష్ట్రంలోనే అత్యధిక కేసులు ఇక్కడ నమోదయ్యాయి. పెద్ద సంఖ్యలోనే మరణాలు సంభవించాయి. వెయ్యి మందికిపైగా కోవిడ్‌లో మృతి చెందారు. ఆ తరువాత క్రమంగా కోవిడ్‌ తగ్గుతూ నియంత్రణలోకి వచ్చింది. ప్రజలు ఈ పాత జ్ఞాపకాల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతూ వచ్చారు. కోవిడ్‌ లేదనుకుని సాధారణ స్థితికి వస్తున్న సమయంలో మరోమారు కేసులు పెరుగుతున్నాయన్న సమాచారం అందటంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. దీంతో అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేస్తోంది. జిల్లా ప్రధాన ఆసుపత్రుల్లో ఇప్పటికే ర్యాపిడ్‌ టెస్టింగ్‌ పరికరాలు ఏర్పాటు చేసియున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఇంకా చేరలేదు. త్వరలోనే అక్కడ కూడా వీటి ఏర్పాట్లు చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు.

అమ్మో కోవిడ్‌…

      కోవిడ్‌ అంటనే జనాల్లో వణుకు పుడుతుంది. రోగాల బారినపడి ఎవరి ప్రాణాలకు ముప్పు ఉందోన్న భయం ఒకవైపు ఉండగా… లాక్‌డౌన్‌ భయాలు మరోవైపు వెంటాడుతున్నాయి. ఎందుకంటే 2020 సంవత్సరంలో మార్చి నెలలోనే కోవిడ్‌ మొదలవడంతో లాక్‌డౌన్‌ విధించారు. ఆ తరువాత ఏప్రిల్‌ నుంచి జిల్లాలో కేసులు నమోదవడం ప్రారంభమైంది. మొదట్లో హిందూపురంలో తొలి కేసు నమోదయింది. ఆ తరువాత క్రమక్రమంగా విస్తరించి ఉమ్మడి అనంతపురం జిల్లాలో తారా స్థాయికి కేసుల తీవ్ర వెళ్లింది. ఒకానొక దశలో ఆసుపత్రుల్లో పడకలు కూడా లభించని పరిస్థితి నెలకొంది. ఆ తరువాత 2021 ఆఖరు నాటికి రెండో దశ కూడా నియంత్రణలోకి వచ్చి కేసులు సాధారణ స్థితికి వచ్చాయి. ఆ తరువాత నుంచి నియంత్రణలో ఉన్నాయి. కేసులు కూడా నమోదవకపోవడంతో ఇంక కోవిడ్‌ లేదనుకుని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు మరోమారు కేసులు నమోదవుతున్నాయన్న భయం అందరినీ వెంటాడుతోంది. లాక్‌డౌన్‌, కోవిడ్‌ మహమ్మారి భయాలు అందరినీ వెంటాడుతున్నాయి.

➡️