ముఖ్యమంత్రీ మాటనిలుపుకో..!

అనంతపురంలో నిరసన తెలుపుతున్న ఆశలు
          అనంతపురం కలెక్టరేట్‌ : పాదయాత్ర సందర్భంగా ఆశా కార్యకర్తలకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేసి మాట నిలుపుకోవాలని ఆశా కార్యకర్తలు నినదించారు. ఎన్నికల హామీల అమలు, సమస్యల పరిష్కారం కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన 36 గంటల వంటా వార్పు నిరసన దీక్షలు శుక్రవారం ముగిశాయి. ఆశా కార్మికుల యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.నాగమణి అధ్యక్షతన రెండు రోజులు పాటు నిర్వహించిన దీక్షలకు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆశాలు పాల్గొని ప్రభుత్వానికి నిరసనను తెలియజేశారు. శిబిరం వద్దనే వంట వార్పుతో సహపక్తి భోజనాలు చేశారు. గురువారం రాత్రి తీవ్రమైన చలిలో సైతం ఆశాలు అక్కడే నిద్రించారు. శుక్రవారం దీక్షల ముగింపు సందర్భంగా పలువురు హాజరై మద్దతు తెలిపారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.రాంభూపాల్‌, జనసేన పార్టీ రాయలసీమ కోఆర్డినేటర్‌ పెండ్యాల శ్రీలత, ఐద్వా రాష్ట్ర కోశాధికారి వి.సావిత్రి, సిపిఎం నగర కార్యదర్శులు ఆర్‌వి.నాయుడు, వి.రామిరెడ్డి, సిఐటియు జిల్లా కోశాధికారి టి.గోపాల్‌, నగర కార్యదర్శులు వెంకటనారాయణ, ముత్తుజా, మెడికల్‌ రెప్స్‌ యూనియన్‌ సురేంద్ర, ఆవాజ్‌ జిల్లా కార్యదర్శి ముస్కిన్‌, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.చంద్రశేఖర్‌రెడ్డి, పోతులయ్య తదితరులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రాంభూపాల్‌ మాట్లాడుతూ ఆశా కార్మికులు అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం వారితో అదనపు పనులు చేయిస్తూ పనిభారం మోపుతోందన్నారు. వీరు పని ఒత్తిడికి గురవుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస వేతనాలు ఇచ్చేందుకు మాత్రం ప్రభుత్వం ముందుకు రాకపోవడం అన్యాయంగా ఉందన్నారు. జనసేన పార్టీ రాయలసీమ కోఆర్డినేటర్‌ పెండ్యాల శ్రీలత మాట్లాడుతూ మొండి ప్రభుత్వానికి పోరాటాలతోనే బుద్ధి చెప్పాలన్నారు. ఆశాల పోరాటాలకు జనసేన అండగా ఉంటుందన్నారు. ఐద్వా రాష్ట్ర కోశాధికారి వి.సావిత్రి మాట్లాడుతూ ఆశాలకు రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాలన్నారు. గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలన్నారు. ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగమణి మాట్లాడుతూ ఆశాలతో ఫీల్డ్‌ వర్క్‌ మాత్రమే చేయించాలన్నారు. అలా కాదని, పిహెచ్‌సి, వీలేజ్‌ క్లీనిక్‌ శుభ్రం చేయించడం సరికాదన్నారు. స్థాయిలో చేయించాల్సిన పనులు చేయిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్మికుల యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు మాలతి, కోశాధికారి భారతి, వరలక్ష్మి, సుజాత, గాయత్రి, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
డిఐఒ స్పందన
ఆశాల దీక్షా శిబిరం వద్దకు డిఐఒ యుగంధర్‌ శుక్రవారం నాడు హాజరై వారితో మాట్లాడారు. జిల్లా స్థాయిలోని సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామన్నారు. విలేజ్‌ క్లీనిక్‌లు శుభ్రం చేసే విధులు ఆశాల పరిధిలో లేవన్నారు. అలా ఎవరైనా చేయిస్తే ఫిర్యాదు చేయాలన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన ఫీల్డ్‌వర్క్‌ మాత్రమే చేయాలన్నారు. రాష్ట్ర స్థాయిలో పరిష్కారించాల్సిన సమస్యలను ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు.

➡️