రూ.98.79 లక్షల మిగులుతో బడ్జెట్‌ ఆమోదం

రూ.98.79 లక్షల మిగులుతో బడ్జెట్‌ ఆమోదం

సమస్యలను లేవనెత్తుతున్న సభ్యులు

ప్రజాశక్తి-రాయదుర్గం రాయదుర్గం పురపాలక సంఘం 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను రూ.98.79 లక్షల మిగులుతో పాలకమండలి ఆమోదం తెలిపింది. రాయదుర్గం పురపాలక సంఘం అధ్యక్షులు పోరాళు శిల్ప అధ్యక్షతన శనివారం కౌన్సిల్‌ బడ్జెట్‌, సాధారణ, అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా సభ్యులు గోవిందరాజులు, అజరుకుమార్‌ మాట్లాడుతూ పురపాలక సంఘపు ఆదాయం ప్రతి ఏడాది పెరగాలికానీ కొన్ని అంశాలలో ఎలా తగ్గించి చూపారని అకౌంటెంట్‌ ఈశ్వర్‌ను ప్రశ్నించారు. ఇందుకు అకౌంటెంట్‌ స్పందిస్తూ ఆర్థిక సంవత్సరం అంచనాలు మాత్రమేనని,, ఆదాయం పెరగవచ్చు.. తగ్గవచ్చు అని వివరించారు. అలాగే తాగునీటి పైప్‌లైన్‌ వేయడానికి టెండర్లు పిలిచి ఆరునెలలైనా ఇంతవరకూ పని చేయడం వల్ల స్థానికులు తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్నట్లు 28వ వార్డు సభ్యులు గోవిందరాజులు తెలిపారు. అలాగే పక్కా ఇళ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ బిల్లులు మంజూరు కావడం లేదన్నారు. నెలాఖరులోగా బిల్లులు చెల్లించనున్నట్లు గృహ నిర్మాణ సంస్థ ఇంజనీర్‌ తెలిపారు. వీధిదీపాల ఏర్పాటుకు టెండర్లు పిలిచి రెండు నెలలైనా ఇప్పటివరకు లైట్లు ఏర్పాటు చేయలేదన్నారు. ఇందుకు కమిషనర్‌ దివాకర్‌రెడ్డి స్పందిస్తూ త్వరలో లైట్లు తెప్పిస్తామని సమాధానం ఇచ్చారు. వీటితోపాటు అనేక సమస్యలపై సభ్యులు నిలదీశారు. అనంతరం పురపాలక సంఘం అధ్యక్షురాలు శిల్ప మాట్లాడుతూ ఆయా విషయాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తర్వాత బడ్జెట్‌ సాధారణ, అత్యవసర సమావేశపు అజెండాలోని అన్ని అంశాలకు కౌన్సిల్‌ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం ఉపాధ్యక్షులు శ్రీనివాస్‌యాదవ్‌, సభ్యులు అజరుకుమార్‌, చన్నవీరస్వామి, తదితరులు పాల్గొన్నారు.

➡️