రైతులకు న్యాయం చేయమంటే అరెస్టులా..? : సిపిఎం

శ్రీ సత్యసాయి జిల్లా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్‌ను అనంతపురంలో గృహ నిర్బంధం చేసిన పోలీసులు

       గోరంట్ల రూరల్‌ : శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలో నాసిన్‌, బెల్‌ కంపెనీల ఏర్పాటుతో భూములు కోల్పోయిన నిర్వాసితులకు న్యాయం చేయమని అడిగేందుకు వెళ్తున్న సిపిఎం, ప్రజాసంఘాల నాయకులను అరెస్టులు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్యని సిపిఎం శ్రీ సత్యసాయి జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్‌ తెలిపారు. గోరంట్ల మండలం పాలసముద్రం గ్రామం వద్ద నాసిన్‌ భవనాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి కలిసేందుకు సిపిఎం నాయకులు వెళ్లకుండా సోమవారం రాత్రి నుంచే ఎక్కడికక్కడ అరెస్టులు జరిగాయి. గోరంట్ల, సోమందేపల్లి, మడకశిర, చిలమత్తూరు తదితర ప్రాంతాల్లో సిపిఎం, ప్రజా సంఘాల నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు చేశారు. ఇంతియాజ్‌తో పాటు జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి పెద్దన్న, ఉపాధ్యక్షులు గంగాధర్‌, కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్షులు హనుమయ్య, ఉపాధ్యక్షులు కొండ వెంకటేష్‌, తదితరులను అరెస్టు చేసి జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. ప్రధాని పర్యటన ముగిసేంత వరకు వారిని స్టేషన్లలో ఉంచుకుని అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా ఇంతియాజ్‌ మాట్లాడుతూ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని నాసిన్‌ అకాడమీకి 503 ఎకరాలు, బెల్‌ సంస్థకు 600 ఎకరాల భూమిని ప్రభుత్వం రైతులు నుంచి బలవంతంగా తీసుకుందన్నారు. గోరంట్ల, సోమందేపల్లి, మండలాలకు చెందిన దాదాపు 200 కుటుంబాలు భూములు కోల్పోయి జీవనాధారం కోల్పోయారని చెప్పారు. వీరికి సరైన పరిహారం ఇప్పటి వరకు అందలేదన్నారు. భూములు కోల్పోయిన వారిలో పేద దళితులే అధికంగా ఉన్నారన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూములు కోల్పోయిన రైతులకు పట్టా, డిసి అనే వ్యత్యాసం చూడకుండా సమాన పరిహారం ఇవ్వాలనే జీవో ఉందన్నారు. దీనికి విరుద్ధంగా ప్రభుత్వం దళిత రైతులకు వివక్ష చూపి పరిహారంగా చాలా తక్కువగా ఇచ్చారన్నారు. దళిత రైతులకు రూ.2.45 లక్షలు ఇచ్చి, పెత్తందారులకు మాత్రం రూ.10 లక్షల పరిహారం ఇచ్చారన్నారు. ఒకే ప్రాంతంలోని భూములకు ఇలా వేర్వేరు విభాగాల మాదిర పరిహారం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈ విషయంలో బాధిత రైతులకు న్యాయం చేయాలని అనేకమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు సిపిఎం ఆధ్వర్యంలో వినతిపత్రాలు ఇచ్చామన్నారు. అయినా ఎవరూ స్పందించలేదన్నారు. భూములిచ్చిన రైతుల కుటుంబంలో ఒకరికి వారి విద్యార్హతను బట్టి ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. నాసిన్‌ అధికారులు టెండర్‌ రూపంలో ఇతర రాష్ట్రం వారికి ఉద్యోగాలు ఇస్తున్నారే కానీ భూములిచ్చిన రైతులకు మాత్రం అవకాశం ఇవ్వడం లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికలు సమీపిస్తుండడంతో వారి వ్యక్తిగత స్వలాభం కోసం కనీసం 50 శాతం కూడా పూర్తికాని నాసిన్‌ భవనాలను ప్రారంభించడం సిగ్గుచేటన్నారు. ఈ సమస్యలన్నింటినీ సిపిఎం, ప్రజాసంఘాల నేతలు ప్రశ్నిస్తారన్న కారణంతోనే ఎక్కడికక్కడ జిల్లాలో పోలీసుల చేత ముందస్తు అరెస్టులు చేయించారన్నారు. అరెస్టులతో పేదల గొంతునొక్కలేరని వారి పక్షాన సిపిఎం పోరాటం చేస్తూనే ఉంటుందని ఇంతియాజ్‌ తెలిపారు.

➡️