సడలని సంకల్పం.!

అనంతపురంలో నిరసన తెలుపుతున్న అంగన్‌వాడీలు

      అనంతపురం ప్రతినిధి : సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్‌వాడీ వర్కర్సు అండ్‌ హెల్పర్సు చేపట్టిన సమ్మె ఉధృతమైంది. అధికారుల బెదిరింపులు, అణచివేతలను ఎదిరిస్తూ సడలని సంకల్పంతో ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. అనంతపురం, సత్యసాయి జిల్లాలో పెద్దఎత్తున అంగన్‌వాడీలు కదం తొక్కారు. నల్లవస్త్రాలు ధరించి వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపట్టారు. పలు చోట్ల బిక్షాటన చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. శుక్రవారం ఉదయం నుంచే అన్ని మండల కేంద్రాల్లో అంగన్‌వాడీలు నిరసనలు చేపట్టారు. సమ్మెను విఫలం చేయడానికి ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలనూ ముమ్మరం చేసింది. సచివాలయాల్లోని హెల్త్‌ సెక్రటరీల ద్వారా బలవంతంగా అంగన్‌వాడీ కేంద్రాలను తెరిపించే కుట్రలు చేశారు. దీనిని సిఐటియు నాయకులు, అంగన్‌వాడీ కార్యకర్తలు ప్రతిఘటించడంతో కేంద్రాలను పూర్తి స్థాయిలో అధికారులు ప్రారంభించలేకపోయారు. బిచ్చిమెత్తి నిరసన ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయడంలో భాగంగా వివిధ రూపాల్లో అంగన్‌వాడీలు ఆందోళనలు చేస్తున్నారు. అనంతపురం జిల్లా కేంద్రంలో నల్లవస్త్రాలు ధరించి చేతిలో బొచ్చెలు పట్టుకుని భిక్షాటన చేశారు. వీరికి సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌, సిఐటియు, ఎస్‌ఎఫ్‌తో పాటు జనసేన నాయకులు మద్దతు తెలిపారు. హిందూపురంలోనూ ఇదే రకంగా నిరసన చేపట్టారు. రోడ్డుపై బిచ్చగాడితో అంగన్‌వాడీలు భిక్ష అడగటం అందరినీ ఆకర్షించింది. అన్ని మండల కేంద్రాల్లోనూ నిరసన ప్రదర్శనలు సాగాయి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సమస్యను పరిష్కరించకుండా సమ్మెను విఫలం చేయాలనుకున్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలను చేశారు.

ముందు బాడుగ కట్టండి

         అనంతపురం నగరంలోని నిర్మలానంద నగర్‌లో బలవంతంగా అంగన్‌వాడీ కేంద్రం ప్రారంభించేందుకు వెళ్లిన సిబ్బందికి చేదు అనుభవం ఎదురైంది. సమ్మెలో ఉన్న అంగన్‌వాడీలు కేంద్రానికి తాళం వేశారు. దీన్ని ప్రారంభించేందుకు సచివాలయ సిబ్బంది వెళ్లారు. ఈ సమయంలో ఐదు నెలలుగా బాడుగ చెల్లించలేదు.. ముందుగా బాడుగ కట్టి తాళాలు తెరవాలని భవన యజమాని చెప్పడంతో ఏమి చేయాలో పాలుపోని పరిస్థితుల్లో అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు.

లబ్ధిదారులకు అవగాహన

      లబ్దిదారులకు అవగాహన కల్పించి మద్దతు కూడగట్టే ప్రయత్నాన్ని అంగన్‌వాడీలు చేపడుతున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే అంగన్‌వాడీలకు ఇంటింటితోనూ పరిచయముంటుంది. వీరు తమ సమ్మెకు మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. గుంతకల్లులో నిరసన చేపట్టిన అంగన్‌వాడీలకు మద్దతుగా లబ్దిదారులు పాల్గొని సమ్మెకు అండగా నిలిచారు. ప్రభుత్వం తక్షణం వారి సమస్యను పరిష్కరించాలని కోరారు. శనివారం నుంచి అంగన్‌వాడీలు లబ్ధిదారుల వద్దకెళ్లి తమ సమస్యలను తెలియజేసి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.

కొనసాగిన సమ్మెపై ‘సమ్మెట’

       అంగన్‌వాడీల సమ్మెను విచ్ఛిన్నం చేయడంలో భాగంగా ప్రభుత్వ సూచనల మేరకు అధికారులు అన్ని అస్త్రాలను బెదిరిస్తున్నారు. విధులకు రాకుంటే ఉద్యోగాలు పోతాయంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఇక సమ్మె సందర్భంగా మూసిన అంగన్‌వాడీ కేంద్రాలను దొడ్డిదారిన తెరిచేందుకు సిద్ధం అవుతున్నారు. ఏకంగా తాళాలు పగులగొట్టి వాటిని తెరస్తున్నారు. సంబంధిత అంగన్‌వాడీ సిబ్బంది లేకుండా తాళాలు పగులగొట్టడం నేరమని తెలిసినా కూడా అధికారులు దగ్గరుండి మరీ ఈ పనులు చేయిస్తున్నారు. అనంతపురం జిల్లాలో గుమ్మఘట్ట, తాడిపత్రి, నార్పల, అనంతపురం, బొమ్మనహాల్‌, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో బీగాలను పగులగొట్టారు. శ్రీసత్యసాయి జిల్లా పరిధిలో రొద్దం, గాండ్లపెంట మండలాల్లో తాళాలు పగులగొట్టారు. సోమందేపల్లి మండలంలో అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు పగులగొట్టడంపై సిఐటియు ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

➡️