‘సూపర్‌ సిక్స్‌’ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి

'సూపర్‌ సిక్స్‌'ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి

పోస్టర్లను అతికిస్తున్న మాజీ ప్రభాకర్‌చౌదరి, నాయకులు

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌

ఈనెల 30వ తేదీలోగా ‘బాబు షూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమం పేరుతో చేపట్టిన ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌చౌదరి పిలుపునిచ్చారు. సోమవారం అనంత అర్బన్‌లోని పలు డివిజన్లలో ‘బాబు షూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ’ సూపర్‌ సిక్స్‌ పథకాలకు సంబంధించిన గోడ పత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తు గ్యారెంటీ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో రాష్ట్రంలో అనంతపురం నియోజకవర్గం 5వ స్థానంలో ఉందన్నారు. మొదటి స్థానానికి చేరుకునే విధంగా ముందుకెళ్లాలని శ్రేణులకు సూచించారు. నగరంలోని 97 వేల ఇళ్లలో ఇప్పటికే సగభాగం బూత్‌ ఎన్‌రోల్‌మెంట్‌ పూర్తయిందని, ఈనెల 30లోగా మిగిలిన శాతం పూర్తి చేయాలన్నారు. అలాగే 50 డివిజన్లతో పాటు నాలుగు పంచాయతీల్లో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ సంబంధించిన 600 పోస్టర్లను జన రద్దీ ప్రదేశాల్లో గోడలకు అతికించాలని ఆదేశించారు. ఒక్కో డివిజన్‌లో 30 నుంచి 40 వరకూ పోస్టర్లు ఉండాలన్నారు. క్లస్టర్‌, యూనిట్‌, బూత్‌ ఇన్‌ఛార్జిలను సమన్వయం చేసుకుని ప్రతి ఇంటికీ సూపర్‌ సిక్స్‌ గ్యారెంటీ బాండ్లను అందించి, అవగాహన కల్పించాలన్నారు. అలాగే గత ప్రభుత్వంలో నగరాభివృద్ధికి చేసిన అంశాలను సంబంధించిన కరపత్రికలను కూడా అందించాలన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగానే నగరంలో భూగర్భ డ్రెయినేజీతో పాటు, రింగ్‌ రోడ్డు సౌకర్యం, గుత్తి రోడ్డులోని డంపు యార్డును తరలిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు దేవళ్ల మురళి, నటేష్‌చౌదరి, గోపాల్‌గౌడ్‌, సుధాకర్‌యాదవ్‌, ముక్తియార్‌, పోతుల లక్ష్మీనరసింహులు, పరంధామ, చిర్రోల్ల రామాంజనేయులు, వడ్డే మురళి, రఫీక్‌ఆహమ్మద్‌, సైపుద్దీన్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️