సెలవుపై అనంత కమిషనర్‌

అనంతపురం కార్పొరేషన్‌

       అనంతపురం కార్పొరేషన్‌ : అనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ భాగ్యలక్ష్మి నెలరోజుల పాటు సెలవుపై వెళ్లనున్నారు. ఈ మేరకు మున్సిపల్‌ పరిపాలన శాఖ డైరెక్టర్‌ కోటేశ్వరరావు నుంచి అనుమతి లభించినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో టౌన్‌ప్లానింగ్‌, ఇంజినీరింగ్‌, ఇతర విభాగాల్లోని అధికారులు పని ఒత్తిళ్లు, కమిషనర్‌ ఒంటెద్దు పోకడలు భరించలేక దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. దీనికి తోడు కార్పొరేషన్‌లో వివిధ విభాగాల్లో అవినీతి స్వైర విహారం చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. అవినీతిని నియంత్రించాల్సిన కార్పొరేషన్‌ ఉన్నతాధికారులు ఆదిశగా చర్యలు తీసుకోలేదని విమర్శలు ఉన్నాయి. అవినీతికి ఊతమిచ్చేలా అధికారి వ్యవహరించారనే వాదన ఉంది. టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో ఏసీపీలు బాలాజీ, చంద్రమోహన్‌ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. రెగ్యులర్‌ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ నాగమోహన్‌ సైతం అనారోగ్య కారణాలతో దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. కార్పొరేషన్‌లో ఏ విభాగంలో జరిగే పని అయినా కమిషనర్‌కు తెలియకుండా జరగదని అక్కడి అధికారులు చెబుతుంటారు. ఏదైనా అవినీతి విషయంలో మాత్రం దిగువ స్థాయి అధికారులను బలి పశువులుగా మారుస్తారనే అభిప్రాయం అధికార వర్గాల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో కార్పొరేషన్‌ అవినీతిపై పత్రికల్లో వరుస కథనాలు వస్తున్నాయి. దీనిపై కూడా కనీసం వివరణ ఇవ్వలేని పరిస్థితిలో కార్పొరేషన్‌ ముఖ్య అధికారులు ఉండడం గమనార్శం. ఇలాంటి పరిస్థితుల్లో కమిషనర్‌ భాగ్యలక్ష్మి గురువారం నుంచి ఏకంగా నెలరోజుల పాటు సెలవుపై వెళ్తుండటం అటు అధికారులు, ఇటు కాంట్రాక్టర్లు, పాలకవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కమిషనర్‌ సెలవు విషయం తెలుసుకున్న కాంట్రాక్టర్లు బుధవారం నాడు పెండింగ్‌ ఫైళ్లపై సంతకాలు చేయాలంటూ పెద్ద సంఖ్యలో ఆమె గది వద్ద వేచి ఉన్నారు. ఇక కమిషనర్‌ సెలవుతో మరోసారి కార్పొరేషన్‌ ఇన్‌ఛార్జి బాధ్యతలు అదనపు కమిషనర్‌ రమణ రెడ్డికి అప్పగించే అవకాశాలు కన్పిస్తున్నాయి.

➡️