బడుగుల ఆశీజ్యోతి పూలే : కలెక్టర్‌

పూలే చిత్రపటం వద్ద నివాళులు అర్పిస్తున్న కలెక్టర్‌ వినోద్‌కుమార్‌

         అనంతపురం : బడుగ, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే అని కలెక్టర్‌ డా||వి.వినోద్‌కుమార్‌ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌ లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జ్యోతిబా ఫూలే 198వ జయంతి వేడుకలను నిర్వహించారు. పూలే చిత్రపటానికి కలెక్టర్‌తో పాటు నగర పాలక సంస్థ కమిషనర్‌ మేఘ స్వరూప్‌, జిల్లా పరిషత్‌ సీఈవో వైఖోమ్‌ నిదియా దేవి, డిఆర్‌ఒ జి.రామకృష్ణారెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా ఫూలే చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి అన్నారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నేటికీ కీర్తింపబడుతున్నారంటే ఆయన చేసిన సేవలు ఎంతో గొప్పవో గుర్తించాలన్నారు. నేటి యువత జ్యోతిబా పూలే జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అంటరానితనం, కులవివక్షత నిర్మూలన, మహిళోద్దరణ, విద్యాభివద్ధికి ఎనలేని కషి చేసిన వ్యక్తి పూలే అన్నారు. జరగబోయే సాధారణ ఎన్నికల్లో మహిళలు ఎక్కువ శాతం బయటికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో బీసీ వెల్ఫేర్‌, ఐసిడిఎస్‌, సాంఘిక సంక్షేమ శాఖల తరఫున మహిళల అభివద్ధికి అవసరమైన అన్ని రకాల కార్యక్రమాలు చేపట్టాలని, ఇందుకోసం అధికారులు అంతా కలిసికట్టుగా పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్‌ డిడి కుష్బు కొఠారి, సోషల్‌ వెల్ఫేర్‌ జెడి మధుసూదన్‌ రావు, ఎస్డీసీ ఆనంద్‌, డిపిఒ ప్రభాకర్‌ రావు, ఐసిడిఎస్‌ పీడీ బిఎన్‌.శ్రీదేవి, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి రామసుబ్బారెడ్డి, ఐఅండ్‌ పిఆర్‌ డిఐపిఆర్‌ఒ గురుస్వామి శెట్టి, కలెక్టరేట్‌ ఏవో అంజన్‌ బాబు, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️