ఆంధ్రాలో సినీ పరిశ్రమ విస్తరించేనా?

Jun 16,2024 19:30 #Film shootings, #movie

రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు గడిచిపోయాయి. రాష్ట్ర విభజన సమయంలో చాలామంది సినిమా పెద్దలు, సినీ పరిశ్రమతో సంబంధం ఉన్న నాయకులూ ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధి గురించి మాట్లాడారు. కానీ, ఈ పదేళ్ల కాలంలో పెద్దగా ఏమీ జరగలేదు. ఇప్పుడు సినీరంగానికి చెందిన పవన్‌ కళ్యాణ్‌, బాలకృష్ణ భాగస్వాములుగా ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడింది. జనసేనకు చెందిన కందుల దుర్గేశ్‌ సినిమాటోగ్రఫీ మంత్రిగా నియమితులైన నేపథ్యంలో మళ్లీ ఆంధ్రాలో చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై చర్చ మొదలైంది.
మద్రాస్‌ (చెన్నై) కేంద్రంగా దక్షిణ భారత చలన చిత్ర రంగం విలసిల్లినప్పుడు తెలుగు సినిమా రంగం కూడా అక్కడ మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలిగింది. అనేకమంది అక్కడ సొంత స్టూడియోలు, థియేటర్లు, రికార్డింగ్‌ థియేటర్లు నిర్మించారు. ఆంధ్ర రాష్ట్రం మద్రాస్‌ నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటైన తర్వాత కూడా రెండు దశాబ్దాలపాటు మద్రాస్‌లోనే ఉండిపోయిన తెలుగు సినిమా అక్కడి నుంచి అనేక సవాళ్ల మధ్య హైదరాబాద్‌కు మారింది. అప్పట్లోని ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాలు కూడా తోడయ్యాయి. అప్పట్లో స్టూడియోలకు స్థలం కేటాయించడం, ఇళ్లు కట్టుకోవడానికి దాదాపు 100 ఎకరాల భూమిని అతి తక్కువ ధరకు ప్రస్తుత ఫిల్మ్‌ నగర్‌లో కేటాయించడం వల్ల హైదరాబాద్‌లో చలన చిత్ర పరిశ్రమ నిలదొక్కుకునేందుకు దోహదం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ కాస్తా తెలంగాణా, ఆంధ్రాగా విడిపోవటంతో మళ్లీ పరిశ్రమ విస్తరణపై చర్చ మొదలైంది. విశాఖపట్నం, తిరుపతి కేంద్రాలుగా సినిమా పరిశ్రమ ఆంధ్రాలోనూ విస్తరించాలనే ఆకాంక్ష వ్యక్తమైంది. విస్తారమైన సాగరతీరం, అడవులు, కృష్ణా గోదావరి నదులు, ప్రకృతి అందాలూ ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఏడెనిమిది దశాబ్దాలుగా షూటింగులు జరుగుతూనే ఉన్నాయి. అన్ని రకాల నేపథ్యాలకు అనువైన ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి.

పదేళ్లయినా పరిశ్రమ ఎక్కడీ
హైదరాబాద్‌లో పరిశ్రమ నిలదొక్కుకోవడానికి ప్రభుత్వం చేసిన సహకారం ఇంతవరకు రాష్ట్రంలో కనిపించటం లేదు. ఉమ్మడి రాష్ట్రంగా ఉనప్పుడే విశాఖలో రామానాయుడు స్టూడియోస్‌ నిర్మించారు. అయినా, అక్కడ షూటింగులు, నిర్మాణ పనులూ జరిగింది తక్కువ. ఆంధ్రలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి విశాఖ, విజయవాడ, తిరుపతి ప్రాంతీయ కేంద్రాలుగా సినిమా స్టూడియోలు ఏర్పాటు కావాల్సివుంది. స్థానికంగా సినిమా నిర్మాణం చేసేవారికి తగిన రాయితీలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఆ దిశగా కృషి కొనసాగటం లేదు. అడపా దడపా సినిమా షూటింగ్‌లు అరకు, పాడేరు, విజయవాడ ప్రకాశం బ్యారేజీ, హార్స్‌లీ హిల్స్‌, బైరవ కోన వంటి ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. ఇన్ఫాస్ట్రక్చర్‌ యూనిట్లు సరిగాలేక నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణాలో ఇండోర్‌, అవుట్‌డోర్‌ యూనిట్లు ఉన్నాయి. ఆంధ్రాలో అవి లేవు. విశాఖలో ఒక్క స్డూడియో మాత్రమే ఉండటంతో తిరుపతికి అవుట్‌డోర్‌ వెళ్లే వారు అక్కడి నుంచి టెక్నాలజీ మొత్తం తీసుకెళ్లటం ఇబ్బందికరంగా మారింది.
మౌలిక వసతులు కరువు
చిత్రీకరణ జరిగే ప్రదేశాల్లో మౌలిక వసతులు కూడా తక్కువగా ఉన్నాయనే అసంతృప్తి సినీబృందాల్లో ఉంది. విశాఖ, తిరుపతి, అరకు వంటి ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ అతిథి గృహాలను నామమాత్రం రుసుంతో కేటాయిస్తే పరిశ్రమ అభివృద్ధికి ప్రోత్సాహం ఇచ్చినట్టవుతుందని చిన్న నిర్మాతలు అంటున్నారు. కేరళ రాష్ట్రం మాదిరిగా ఎపి ప్రభుత్వం కూడా ఇండోర్‌, అవుట్‌డోర్‌ యూనిట్లు ఏర్పాటు చేసి షూటింగ్‌లకు ఇస్తే పరిశ్రమ అభివృద్ధికి దోహదపడుతుంది. కొందరికి ఉపాధి అవకాశాలు కల్పించిన వారవుతారు. టెక్నాలజీతోపాటుగా నైపుణ్యమైన వారు కూడా ఉండాలి. స్కిల్‌ డెవలప్మెంట్‌ ద్వారా నైపుణ్యం కల్గిన వారిని తయారుచేయొచ్చు. ఎనిమిదేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో చిన్న సినిమాలకు రూ.10 లక్షల సబ్సిడీ ఇస్తూ అప్పటి ప్రభుత్వం జీవోను జారీచేసింది. అయితే నేటికీ ఏ ఒక్క నిర్మాతకు సబ్సిడీ రాలేదు. కారణం నిబంధనలు కష్టంగా ఉండటం. కర్ణాటక మాదిరిగా సబ్సిడీ రూల్స్‌ సడలిస్తే బాగుంటుందని చిన్న నిర్మాతలు కోరుతున్నారు.
నంది అవార్డుల సంగతేంటీ?
నంది అవార్డులు ప్రకటించి సుమారు ఎనిమిదేళ్లు గడిచింది. అప్పట్లో వచ్చిన ఏదో చిన్న సమస్యను బూచీగా చూపించి అవార్డుల ప్రకటన ఆపేశారు. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావటంతో తిరిగి అవార్డులను ప్రకటిస్తారనే ఆశాభావం పరిశ్రమలో కన్పిస్తోంది. ఈ అవార్డులు ప్రకటించటం ద్వారా ఇండిస్టీలో హీరోహీరోయిన్లు, క్యారెక్టర్‌ ఆర్టిస్టులు, 24 విభాగాల్లో ఉన్న సాంకేతిక నిపుణులకు తమ ప్రతిభను నిరూపించుకోవటానికి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఉన్నా పరిశ్రమకు అనుకున్నంత మేలు జరగటం లేదు. హైదరాబాద్‌ కేంద్రంగానే సినిమా పరిశ్రమ కొనసాగుతోంది. తెలుగు సినిమా రెండు రాష్ట్రాల్లో కాక దేశవ్యాప్తంగా వ్యాపార పరిధిని విస్తరించుకుందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలో ఆంధ్రాలో కూడా పరిశ్రమ విస్తరిస్తే రాష్ట్రప్రభుత్వానికి ఆదాయం పెరగటమే కాకుండా స్థానికులకు కొంతమేరకైనా ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది.

➡️