ఎన్నికల విధులను జాగ్రత్తగా చేపట్టాలి : కలెక్టర్‌

ఎన్నికల నోడల్‌ అధికారులతో సమావేశం నిర్వహిస్తున్న కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌

          అనంతపురం కలెక్టరేట్‌ : సాధారణ ఎన్నికల నేపథ్యంలో నియమించిన నోడల్‌ అధికారులు ఎన్నికల విధులను జాగ్రత్తగా చేపట్టాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డా||వి.వినోద్‌ కుమార్‌ ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో సాధారణ ఎన్నికల కోసం నియమించిన నోడల్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్‌, జిల్లా పరిషత్‌ సీఈవో వైఖోమ్‌ నిదియా దేవి, నగరపాలక సంస్థ కమిషనర్‌ మేఘస్వరూప్‌, డిఆర్‌ఒ జి.రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నోడల్‌ అధికారులు కంగారు పడకుండా అందరూ స్పష్టతతో, క్రమశిక్షణతో, ప్రణాళికతో పనిచేయాలన్నారు. నోడల్‌ అధికారులు ఎన్నికల కమిషన్‌ సూచనలను చదివి అవగాహన కలిగి ఉండాలన్నారు. నిర్ణీత సమయంలోపు అన్ని రకాల రిపోర్టులను ప్రొఫార్మాలో అందించాలన్నారు. ఏ సమస్య ఉన్నా 24 గంటల్లోగా పరిష్కరించాలన్నారు. ఎన్నికల కోసం నిర్వహించే శిక్షణ కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. నోడల్‌ అధికారులకు ఎలాంటి సమస్య ఉన్నా డిఆర్‌ఒ దృష్టికి తీసుకురావాలని, జెసి కూడా అందుబాటులో ఉంటారన్నారు. ఈ సమావేశంలో కలెక్టరేట్‌ ఏవో అంజన్‌ బాబు, సూపరింటెండెంట్‌ రవికుమార్‌, నోడల్‌ అధికారులు వీర్రాజు, మధుసూదన్‌, రావు, కుష్బు కొఠారి, ఉమామహేశ్వరమ్మ, రఘునాథ రెడ్డి, వరలక్ష్మి, బసవరాజు, వెంకటేశ్వర్లు, అప్పాజీ, రసూల్‌, గురుస్వామి శెట్టి, డిఐఒ రవిశంకర్‌ పాల్గొన్నారు.

➡️