పేద ప్రజల్లో వెలుగులు నింపాలన్నదే కేకే రెడ్డి లక్ష్యం

Jan 13,2024 16:11 #Annamayya district
dress distribution

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : ప్రార్థించే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులు మిన్న అనే సూక్తిని అక్షరాల నిజం చేసి చూపిస్తూ ఎంతోమంది నిరుపేదల కుటుంబాలలో వెలుగులు నింపుతున్న ఎన్నారై కే.కే. రెడ్డి సేవలు స్ఫూర్తిదాయకమని వీరబల్లి ఎంపీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ చిన్నపరెడ్డి, ఉమ్మడి జిల్లా లయన్స్ క్లబ్ అధ్యక్షులు పోతుల వెంకటరామిరెడ్డి అన్నారు. మన్నూరు రామలక్ష్మమ్మ, మన్నూరు నారాయణరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రంలోని పెద్ద కారంపల్లి పంచాయతీలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని చుట్టుపక్కల ఉన్నటువంటి 13 పల్లెల నిరుపేదలకు ఖరీదైన చీరలు, పంచలు, చిన్నపిల్లలకు టీ షర్టులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతోమంది డబ్బులు సంపాదిస్తారే కానీ ఖర్చు పెట్టేందుకు ఆసక్తి చూపరన్నారు. అయితే అందుకు భిన్నంగా కే.కే రెడ్డి జన్మనిచ్చిన సొంతూరి రుణం తీర్చుకునేందుకు తాను అమెరికాలో ఉంటూ సంపాదించిన సొమ్ముతో ప్రతి సంవత్సరం పేద ప్రజల కోసం సంక్రాంతికి బట్టలు పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఒకవైపు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూనే మరోవైపు ఆధ్యాత్మికంగా ప్రజల్లో భక్తి భావనను పెంపొందించేందుకు దేవాలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. రానున్న రోజుల్లో కూడా తన తల్లిదండ్రుల ఫౌండేషన్ తరపున ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని ఆకాంక్షించారు. అనంతరం వీడియో కాల్ ద్వారా కేకే రెడ్డి పెద్ద కారంపల్లి ప్రజలకు ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దకరంపల్లి పంచాయతీలో ఉన్నటువంటి నిరుపేద ప్రజలకు తమ ఫౌండేషన్ ద్వారా రానున్న రోజుల్లో మరెన్నో నిరంతర సేవా కార్యక్రమాలను కొనసాగించడం జరుగుతుందన్నారు. అంతకు మునుపు కేకే రెడ్డికి జన్మనిచ్చిన మాతృమూర్తి రామలక్ష్మమ్మను ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారు అభినందించి, ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు అబ్దుల్లా, రాఘవేంద్ర వర్మ, ఎస్ ఎం డి భాష, పంతుల పవన్ కుమార్, కొండూరు జనార్దన్ రాజు, కుటుంబ సభ్యులు మన్నూరు వెంకటసుబ్బారెడ్డి, శుభోద్ రెడ్డి నారాయణరెడ్డి, అశోక్ రెడ్డి, శివరామిరెడ్డి, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

➡️